English | Telugu
పౌరుషంతో పొగరుగా రాజకీయాల్లోకి వస్తానంటున్న బండ్లన్న!
Updated : May 13, 2023
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ విషయం చెప్పారు. మొదట "నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం" అని ట్వీట్ చేసిన ఆయన, ఆ తర్వాత "నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా" అన్నారు. "బానిసత్వానికి భాయ్ భాయ్ నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై" కొట్టారు.
అంతటితో ఆయన ఆగలేదు. "రాజకీయాలంటే నిజాయితీ.. రాజకీయాలంటే నీతి.. రాజకీయాలంటే కష్టం.. రాజకీయాలంటే పౌరుషం.. రాజకీయాలంటే శ్రమ.. రాజకీయాలంటే పోరాటం.. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి.. అందుకే వస్తా" అని ప్రకటించారు.
జనసేనాని పవన్ కల్యాణ్‌ను దేవునిగా, తను ఆయనకు పరమ భక్తునిగా బండ్ల గణేశ్ చెప్పుకుంటూ రావడం మనకు తెలుసు. రీసెంట్‌గా పవన్ కల్యాణ్, "కర్ణాటకలో కుమారస్వామి గారి లాగా 30-40 సీట్లను గెలుచుకోగలిగితే, మన మిత్ర పక్షాలను సీఎం అభ్యర్థి రోల్ కోసం డిమాండ్ చేయగలం, లేకపోతే మనం డిమాండ్ చెయ్యలేం" అని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో "బానిసత్వానికి భాయ్ భాయ్ నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై" అని బండ్ల గణేశ్ ట్వీట్ చేయడం గమనార్హం. దాన్ని బట్టి ఆయన జనసేనలో కాకుండా వేరే పార్టీలో చేరతారా అనే అభిప్రాయం కలుగుతోంది. చూద్దాం.. బండ్లన్న నెక్స్ట్ స్టెప్ ఏం వేస్తారో...