English | Telugu

న్యూసెన్స్ వెబ్ సిరీస్ రివ్యూ

వెబ్ సిరీస్ పేరు: న్యూసెన్స్
నటీనటులు: నవదీప్, బిందు మాదవి, మహిమ శ్రీనివాస్, షెల్లీ నబు కుమార్, నంద గోపాల్, రమేష్ కొనంబొట్ల, జ్లానేశ్వర్ దేవనపల్లి, చరణ్ కురుగొండ తదితరులు
సినిమాటోగ్రఫీ: అనంతనాగ్ కావూరి
ఎడిటింగ్: శ్రీనివాస్ బైనబోయిన
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాతలు: టి.జి విశ్వ ప్రసాద్
డైరెక్టర్: శ్రీప్రవీణ్ కుమార్
ఓటిటి: ఆహా

నవదీప్, బిందు మాధవి కలిసి నటించిన 'న్యూసెన్స్' సిరీస్ ని శ్రీప్రవీణ్ కుమార్ డైరెక్ట్ చేసాడు. అసలు 'న్యూసెన్స్' కథేంటి ?పొలిటీషన్స్, పోలీసుల మధ్యలో మీడియా పాత్ర ఏంటి? ఈ సీరీస్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం.

కథ:
మదనపల్లి గ్రామంలో ప్రెస్ క్లబ్ ని నడిపిస్తుంటాడు ఈశ్వర్. ఇందులో శివ(నవదీప్), ఇలియాజ్, నీల(బిందు మాధవి), ఇంకా కొంతమంది జర్నలిస్టులతో ఈ ప్రెస్ క్లబ్ ని రన్ చేస్తున్న ఈశ్వర్.. ఒకవైపు పోలీసులకి, మరోవైపు ఇద్దరు పొలిటీషన్స్ కి మధ్య రాయబారిగా మారుతాడు. అక్కడ జరుగుతున్న అక్రమాలను డబ్బులు తీసుకొని కప్పివేస్తుంటాడు శివ(నవదీప్). అయితే శివకి గిట్టనివాళ్ళున్నారు. ఒకరోజు రాత్రి శివ బైక్ పై వస్తుండగా కొందరు దుండగులు దాడి చేస్తే అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడతాడు. అసలు శివని చంపాలనుకుందెవరు? పొలిటీషన్స్ కి శివకి మధ్య ఒప్పందం ఏంటి? ఇందులో పోలీసుల పాత్ర ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే 'న్యూసెన్స్' వెబ్ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:
మదనపల్లి గ్రామంలో అక్రమంగా పేదల భూమిని ఆక్రమించుకుంటారు పొలిటీషన్స్. నాగిరెడ్డి మదనపల్లిలో పదవిలో ఉండి అక్రమాలు చేస్తుంటాడు. దానిని కవర్ చేయడానికి ప్రెస్ క్లబ్ లోని ఎడిటర్స్ కి, న్యూస్ రిపోర్టర్స్ కి తగినంత డబ్బులు ఇస్తుంటాడు. ఇలాంటి ఒక అక్రమ వ్యాపారాలని ఆ ప్రెస్ రిపోర్టర్స్ డబ్బులకి దాసోహమై న్యాయం, అన్యాయం అంటూ తేడా లేకుండా న్యూస్ ని రాసేస్తుంటారు.

అయితే ఈ సిరీస్ లోని మొదటి ఎపిసోడ్‌లో శివ(నవదీప్) కి ఎలవేషన్ కోసం ఒక సీన్ యాడ్ చేయడం తప్ప పెద్దగా ఏమీ ఉండదు. అసలు రెండవ ఎపిసోడ్‌లో అన్ని పాత్రలని పరిచయం చేసాడు. అయితే ప్రతీ పాత్ర ఆశిచినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోవడం పెద్ద మైనస్. వ్యాపార విలువల కోసం ఒక మనిషిని చంపేసిన పొలిటీషన్స్ కోసం డబ్బులు తోసుకొని దానిని సమర్ధిస్తూ అసలు నిజాన్ని దాటేసి అదే ప్రెస్ నుండి ఒక ఫేక్ న్యూస్ రాయడమనేది సమాజంలో తగ్గిపోతున్న నైతిక విలువలను ప్రతిబింబించేలా ఉన్నాయి.

ఇక ఈ సిరీస్ లో స్లో సీన్స్ చాలానే ఉన్నాయి. అనవసరమైన రొమాంటిక్ సీన్లు.. ఏదో హీరో, హీరోయిన్ లు ఉన్నారని వారికోసమే ఆ సన్నివేశాలని రాసుకున్నాడేమో డైరెక్టర్. అయిదు ఎపిసోడ్‌లలో ఒకటే కథ.‌. మళ్ళీ మళ్ళీ అవే సీన్స్ లా అనిపిస్తుంటాయి. ఇక చివరిదైన ఆరవ ఎపిసోడ్‌లో ఈ కథలోని అంశాన్ని కాస్త గుర్తుపెట్టుకొని తీసినట్టుగా ఉన్నారు మేకర్స్. అప్పటిదాకా శివ(నవదీప్)తో కలిసి పనిచేస్తున్న నీల(బిందు మాధవి) ఒక్కసారిగా వేరే పొలిటీషన్ కి ఒక విలువైన సమాచారం ఇచ్చినట్టుగా మనకి చూపిస్తారు. ఈ ఒక్క లాస్ట్ ఎపిసోడ్‌ తప్ప.. ఏ ఎపిసోడ్ లోను కథ లేదు. నత్తనడకగా సాగుతున్న సీన్లన్ని దాటుకొని కథ చూద్దామంటే..అవే రిపీటెడ్ సీన్లు.. ఎంతకీ తెలియని పొలిటీషన్స్ మధ్య గొడవ? మదనపల్లిలోని ప్రెస్ క్లబ్ అసలు ఎందుకుందో అర్థం కాదు. కథలో టెంపో మిస్ అయింది. కథనం ఆకట్టుకోలేకపోయింది. ఎంత గొప్ప నటుడు ఉన్నా కథలో కంటెంట్ లేకుంటే అది ప్రేక్షకులని మెప్పించదనే విషయాన్ని మేకర్స్ తెలుసుకోలేకపోయారు. ప్రతీ ఎపిసోడ్ నిడివి తక్కువే ఉన్నా చూడటానికి ఏమీ లేదు.. ఆహా ఇదీ సీన్ అంటే అని అనేలా ఏ ఒక్క సీన్ లేదు. ఒక్కో దశలో న్యూస్ ఏం రాయాలో కూడా ఓ రౌడీ చెప్తుంటే.. న్యూస్ రిపోర్టర్ శివ(నవదీప్) నవ్వుతాడు.

కథలో కొత్తదనం లేదు.. ఇప్పటిదాకా మనం చాలా సినిమాలలో చూసిన మీడియా, పోలీసులు, పొలిటీషన్స్ మధ్యన జరిగే సీన్లన్ని కలిపి కొంత భాష మార్చి తీసినట్టుగా ఉంది. కథ ఎంతకీ ముందుకు సాగదు. పోనీ చివరి ఎపిసోడ్‌లో అయిన అసలు బ్యాక్ గ్రౌండ్ లో కథ ఏం జరిగిందో తెలుసుకుందామంటే.. రెండవ భాగం ఉంటుందంటూ ఓ చిన్న గ్లింప్స్.‌. అలా ఈ కథని అసంపూర్ణంగా వదిలేసారు మేకర్స్. ఈ సిరీస్ మొదటి భాగం చూసిన ప్రేక్షకులకు రెండవ భాగం చూడాలన్న ఆసక్తి కూడా ఉండదు. అన్నం తింటుంటే రాయి వచ్చి పంటి కింద పడ్డట్టు.. కథ మధ్యలో శివ(నవదీప్), నీల(బిందు మాధవి) ల రొమాన్స్ ఉంటుంది. అసలు ఏమీ లేని కథకి ఆరు ఎపిసోడ్‌ లు ఎందుకో అర్థం కాలేదు. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం బాగుంది. అనంత్ నాగ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. బైనబోయిన శ్రీనివాస్ చాలావరకు సీన్లని ట్రిమ్ చేస్తే బాగుండు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటులు పనితీరు:
శివగా నవదీప్ నటన ఈ వెబ్ సిరీస్ కి ప్రాణం పోసింది. నీలగా బిందు మధవి ఆకట్టుకుంది. తన అందం, అభినయంతో బిందు మాధవి పర్వాలేదనిపించింది. మహిమ శ్రీనివాస్ తన నటనతో మెప్పించాడు. ఇక మిగిలిన వాళ్ళు వాళ్ళ పాత్రలలో బాగా నటించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:
జనాలకు చూపించేవన్నీ నిజాలు కాదు.. డబ్బుకి దాసోహమైన కొన్ని మీడియా సంస్థలు అసలు న్యూస్ ని దాచేస్తాయనే థీమ్ తో వచ్చిన ఈ సిరీస్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్ ని ఇస్తూనే మంచి సందేశాన్ని ఇస్తుంది. అయితే పూర్తిగా చూడాలంటే ప్రేక్షకులకు కాస్త ఓపిక కూడా కావాలి.

రేటింగ్: 2 / 5

✍🏻. దాసరి మల్లేశ్