Read more!

English | Telugu

'అన్నీ మంచి శకునములే' మూవీ రివ్యూ

 

సినిమా పేరు: అన్నీ మంచి శకునములే
తారాగణం: సంతోష్ శోభన్, మాళవికా నాయర్, రాజేంద్ర ప్రసాద్, నరేశ్, రావు రమేశ్, గౌతమి, అంజు ఆల్వా నాయక్, అశ్విన్ కుమార్, ఊర్వశి, వెన్నెల కిశోర్, వాసుకి, షావుకారు జానకి, రమ్యా సుబ్రమణ్యన్, వడ్లమాని శ్రీనివాస్, సత్యా, ఝాన్సీ
స్క్రీన్‌ప్లే: దావూద్
డైలాగ్: లక్ష్మీ భూపాల
సాహిత్యం: చంద్రబోస్, రెహమాన్,
మ్యూజిక్: మిక్కీ జె. మేయర్
సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్
ఎడిటింగ్: జునైద్ సిద్దిఖి
ప్రొడక్షన్ డిజైన్: శివం రావ్ 
నిర్మాత: ప్రియాంకా దత్
దర్శకత్వం: బి.వి. నందినీరెడ్డి
బ్యానర్: స్వప్న సినిమా, మిత్రవిందా మూవీస్
విడుదల తేదీ: 18 మే 2023

'ఓ బేబీ' లాంటి ఘన విజయం సాధించిన సినిమా తర్వాత నాలుగేళ్ల విరామంతో నందినీరెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా 'అన్నీ మంచి శకునములే'. ఈ మధ్యలో 'పిట్ట కథలు' అనే నాలుగు షార్ట్ ఫిలిమ్స్ ఆంథాలజీలో 'మీరా' అనే సెగ్మెంట్‌ను ఆమె రూపొందించింది. ఫీల్ గుడ్ ఫిలిమ్స్‌తో మంచి పేరు సంపాదించుకున్న స్వప్న సినిమా బ్యానర్‌పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ సినిమాలో సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటించారు. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ అందించిన పాటలు ఇప్పటికే జనాదరణ పొందడంతో మరో చక్కని ఫీల్ గుడ్ సినిమాని చూడబోతున్నామని సినీ ప్రియులు ఆశించారు. మరి మన ముందుకొచ్చిన 'అన్నీ మంచి శకునములే' ఎలా ఉన్నదంటే...

కథ
తాగుబోతైన ఒక డాక్టరమ్మ (ఊర్వశి) చేసిన పొరబాటు వల్ల శిశువులు తారుమారై, సుధాకర్ (నరేశ్) కూతురుగా ఆర్య (మాళవికా నాయర్) పెరిగితే, ప్రసాద్ (రాజేంద్రప్రసాద్) కొడుకుగా రిషి (సంతోష్ శోభన్) పెరుగుతాడు. ముత్తాతల కాలం నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య కె.జె. కాఫీ ఎస్టేట్ సొంతం చేసుకోవడం కోసం కోర్టు కేసులు నడుస్తుంటాయి. సుధాకర్ అన్నయ్య దివాకర్ (రావు రమేశ్) ఈ కోర్టు కేసులు చూసుకుంటూ ఉంటాడు. అయినా రిషి, ఆర్య కలిసి చదువుకుంటారు, కలిసి పెరుగుతారు. రిషి సరదాగా జీవితాన్ని గడపాలనుకొనే అబ్బాయయితే, ఆర్య అతనికి పూర్తి భిన్నంగా డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా, కాలిక్యులేటెడ్‌గా ఉండే అమ్మాయి. ఆర్య అంటే రిషికి చాలా ఇష్టం. రిషి, ఆర్య జన్మ రహస్యం ఎప్పటికైనా బయటపడిందా? పరిస్థితుల ప్రాబల్యం వల్ల రిషి కజిన్ రామ్ కు దగ్గరైన ఆర్య చివరకు ఏం చేసింది? సుధాకర్, ప్రసాద్ కుటుంబాల మధ్య వైరం ఏ తీరానికి చేరింది?.. వంటి అంశాలను మిగతా సినిమాలో చూస్తాం.

విశ్లేషణ
హాస్పిటల్ బెడ్‌మీద శిశువులు మారిపోవడం అనే విషయాన్ని పాత సినిమాల కాలం నుంచి నిన్నటి 'అల.. వైకుంఠపురములో' సినిమా దాకా చూస్తూనే వస్తున్నాం. ఇదొక సక్సెస్ సెంటిమెంట్ అనుకుందేమో డైరెక్టర్ నందినీ రెడ్డి అదే అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ సినిమాని తీసింది. అయితే ప్రసాద్, దివాకర్ మధ్య కాఫీ ఎస్టేట్ గొడవలతో మనమేమాత్రం కనెక్ట్ కాలేం. ఫ్లాట్ స్క్రీన్‌ప్లే కారణంగా ఫస్టాఫ్ మరీ బోరింగ్ అనిపిస్తుంది. కాఫీ బిజినెస్ నిమిత్తం ప్రసాద్, ఆర్య కలిసి యూరప్ ట్రిప్‌కు వెళ్లాల్సి వుండగా, ప్రసాద్ పంటి సమస్య కారణంగా అతని బదులు రిషి వెళ్లడం కృతకంగా అనిపిస్తుంది. యూరప్‌లో రిషి, ఆర్య మధ్య గొడవ జరిగి.. ఆర్యను అక్కడే వదిలేసి రిషి తన దారిన తను వెళ్లిపోవడం ఇంటర్వెల్ సీన్. ఇది రిషి పాత్ర ఔచిత్యాన్ని దెబ్బతీసే సీన్. 

సినిమాలో ప్రతి ముఖ్యమైన పాత్రకూ ఓ సొంత గొడవ ఉంటుంది. ఈ గొడవలతో ప్రేక్షకుడు సహానుభూతి చెందకపోవడమే 'అన్నీ మంచి శకునములే' సినిమాకు పెద్ద మైనస్ పాయింట్. అటు ఆర్య పాత్రతో కానీ, ఇటు రిషి ప్రవర్తనతో కానీ మనం కనెక్ట్ కాలేకపోయామంటే.. అది ఆ పాత్రల్ని అలా మలచిన రచయితదీ, తెరపై వాటిని అలా చూపించిన దర్శకురాలిదీనూ.. ప్రి క్లైమాక్స్, క్లైమాక్స్‌లోని ఎమోషన్ ఒక్కటే సినిమా కథకు సంబంధించిన అనుకూలాంశం. కానీ అది సినిమాని రక్షించే స్థాయిలో లేదు. 

లక్ష్మీ భూపాల సంభాషణలు సందర్భానుసారం సాగాయి. దావూద్ స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉంది. నందినీరెడ్డి సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకొనేలా లేదు. ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్ కెమెరాల పనితనం బాగానే ఉంది. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ ఆకట్టుకుంది. పాటలు బాగానే ఉన్నాయి. 'చెయ్యి చెయ్యి కలిపేద్దాం చేతనైంది చేసేద్దాం' పాటను ఎక్కువమంది లైక్ చేస్తారు. జునైద్ ఎడిటింగ్ సాధారణ స్థాయిలో ఉంది. శివం రావ్ ఆర్ట్ వర్క్ ఫర్వాలేదు.

నటీనటుల పనితీరు
రిషి, ఆర్య పాత్రల్లో సంతోష్ శోభన్, మాళవికా నాయర్ ఓకే అనిపించే తరహాలో నటించారు. మాళవిక హెయిర్ స్టైల్ బాలేదు. తన నటనలో సహజత్వం బదులు ఎక్కువగా కృతకత్వం కనిపిస్తోందనే విషయాన్ని సంతోష్ శోభన్ గ్రహించుకోవాలి. ప్రసాద్‌గా రాజేంద్రప్రసాద్, సుధాకర్‌గా నరేశ్, దివాకర్‌గా రావు రమేశ్ జీవించేశారు. ప్రసాద్ భార్య మీనాక్షి రోల్‌లో గౌతమి, సుధాకర్ భార్య పాత్రలో అంజు ఆల్వా నాయక్ ఇమిడిపోయారు. రామ్ క్యారెక్టర్‌లో అశ్విన్ కుమార్ కనిపించాడు. ప్రసాద్ అల్లుడుగా వెన్నెల కిశోర్ నవ్వించే ప్రయత్నం చేశాడు కానీ ఫలించలేదు. హీరో అక్క పాత్రలో వాసుకి, హీరోయిన్ అక్కగా రమ్య సుబ్రమణ్యన్ నటించారు. కథను మలుపుతిప్పే తాగుబోతు డాక్టరమ్మగా ఊర్వశి కనిపించారు. ఒక సీన్‌లో కామెడీని పండించడం కోసం సత్యాను పెట్టారు కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఝాన్సీ, వడ్లమాని శ్రీనివాస్, రంగస్థలం మధు పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలు చేశారు.

తెలుగువన్ పర్‌స్పెక్టివ్
పాత చింతకాయ పచ్చడి లైన్‌తో, ఒక ఫీల్ గుడ్ మూవీని ప్రేక్షకుల ముందు ప్రెజెంట్ చెయ్యాలనుకున్న నందినీరెడ్డి ప్రయత్నం బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువ. చివరాఖరి పదిహేను నిమిషాలు మినహా మిగతా సినిమా అంతా గుడ్ ఫీలింగ్ బదులు బోరింగ్ అనిపించడమే 'అన్నీ మంచి శకునములే' చేసుకున్న పాపం. 'స్వప్న సినిమా'కు ఈ శకునం బాలేదు.

రేటింగ్: 2/5

- బుద్ధి యజ్ఞమూర్తి