English | Telugu

టాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో 10 సినిమాలు.. డీల్ కుదుర్చుకున్న బాలీవుడ్ సంస్థ‌!


ఇటీవ‌లికాలంలో సౌత్ డైరెక్ట‌ర్ల‌కు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. సౌత్ నుంచి వెళ్లిన ఎన్నో సినిమాలు బాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్ట‌ర్లంటే అక్క‌డ ఎంతో క్రేజ్ ఉంది. అయితే ఆ డైరెక్ట‌ర్ల లిస్ట్‌లో లేని ఓ టాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో ఓ బాలీవుడ్ సంస్థ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అత‌నెవ‌రో కాదు, ర‌మేష్‌వ‌ర్మ‌.

బాలీవుడ్ అగ్ర నిర్మాణ పెన్ స్టూడియోతో క‌లిసి డీల్ కుదుర్చుకున్నారు ర‌మేష్ వ‌ర్మ‌. ఈ సంస్థ‌తో క‌లిసి మొత్తం 10 సినిమాలు చెయ్యాల్సి ఉండ‌గా మొద‌టి విడత‌లో నాలుగు ప్రాజెక్టులు ఓకే అయ్యాయి. ఈ నాలుగు సినిమాల బ‌డ్జెట్ సుమారు 150 కోట్ల రూపాయ‌లు ఉంటుంద‌ని తెలుస్తోంది.


త‌మిళ స్టార్స్ విక్ర‌మ్‌, ధ్రువ్‌, లారెన్స్‌, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గ‌ణ్‌ల‌తో ఈ నాలుగు సినిమాలు ఉంటాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమాల‌కు సంబంధించిన క‌థ‌లు కూడా ఫైన‌ల్ అయిపోయాయి. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఈ నాలుగు సినిమాల టైటిల్స్‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తారు.

ఇదిలా ఉంటే.. ద‌ర్శ‌కుడు ర‌మేష్‌వర్మ `కొక్కొరొక్కో` అనే ఓ చిన్న సినిమాను స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. స‌మ్మ‌ర్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అలాగే బాలీవుడ్‌లో ఘ‌న‌విజ‌యం సాధించిన `కిల్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా పూర్త‌యింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది.