English | Telugu
ఎవరినీ వదల్లేదు.. 73 మందిపై కేసు పెట్టిన అనసూయ!
Updated : Jan 16, 2026
గత కొన్నిరోజులుగా టాలీవుడ్‌ని ఊపేస్తున్న అనసూయ, శివాజీ వివాదం రోజుకో మలుపు తిరుగుతూ మరింత ముదురుతోంది. హీరోయిన్ల వేషధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందించి తనదైన స్టైల్‌లో సమాధానం చెప్పిన అనసూయపై ఎంత ట్రోలింగ్ నడిచిందో అందరికీ తెలిసిందే. అక్కడా, ఇక్కడా అనే భేదం లేకుండా ప్రతి ప్లాట్‌ఫామ్‌లోనూ ఆమెకు వ్యతిరేకత కనిపించింది. పనిలోపనిగా కొందరు విశ్లేషకులు, నేతలు శివాజీ, అనసూయ వివాదంలో తలదూర్చి కాస్త ఘాటుగానే స్పందించారు.
గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఈ వ్యతిరేక కార్యక్రమంపై స్పందించిన అనసూయ.. మీడియా ముఖంగా కన్నీరు మున్నీరయ్యారు. అంతటితో ఆగకుండా తనను అప్రతిష్టపాలు చెయ్యాలని ప్రయత్నించిన వారిని ఒక్కొక్కరిగా ఏరి మొత్తం 73 మందిపై కేసు పెట్టారు. అందులో మీడియాలో తన గురించి మాట్లాడినవారు, ట్రోలింగ్ చేసిన వారు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. బొజ్జ సంధ్యారెడ్డితోపాటు ప్రియా చౌదరి గోగినేని, పావని, శేఖర్ బాషా, రజినీ లాంటివారు ప్రధానంగా కనిపిస్తున్నారు. అలాగే పలు న్యూస్ టీవీలో యాంకర్లు, సోషల్ మీడియా స్టార్లు ఉన్నారు.
ఈ కేసు విషయాన్ని సింగర్ చిన్మయి స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. యాంకర్ అనసూయను ఉద్దేశించి రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలను మీడియాలో ఎక్కువగా ప్రచారం చేశారని చిన్మయి అన్నారు. మహిళల పట్ల గౌరవం ఉంటే వెంటనే సంధ్యారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పుడు చిన్మయి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.