English | Telugu

శ్రీతేజ్‌ కోలుకోవడానికి మరింత సపోర్ట్‌ ఇస్తున్న అల్లు అర్జున్ 

గత ఏడాది డిసెంబర్‌ 4న 'పుష్ప2' చిత్రం ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన దుర్ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో భాస్కర్‌ అనే వ్యక్తి భార్య చనిపోగా, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. కుమారుడు శ్రీతేజ్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు అతనికి చికిత్స జరుగుతూనే ఉంది. చికిత్స నిమిత్తం అయ్యే ఖర్చును అల్లు అర్జునే భరిస్తున్నారని తెలుస్తోంది.


ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత, ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌రాజు.. గురువారం శ్రీతేజ్‌ తండ్రి భాస్కర్‌ను కలిశారు. శ్రీతేజ్‌కు ఎలాంటి చికిత్స అందుతోంది, ఆర్థికంగా ఆ కుటుంబాన్ని అల్లు అర్జున్‌ ఎలా ఆదుకుంటున్నారు అనే విషయాల గురించి వెల్లడించారు. 'గత ఏడాది జరిగిన ఘటన గురించి అందరికీ తెలుసు. ఆ ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ రోజురోజుకీ కోలుకుంటున్నాడు. ఆ సమయంలో భాస్కర్‌ ఫ్యామిలీకి అల్లు అర్జున్‌ ద్వారా రెండు కోట్ల రూపాయలు డిపాజిట్‌ చేయించడం జరిగింది. దాని ద్వారా నెలనెలా వచ్చే ఇంట్రెస్ట్‌లో 75 వేల రూపాయల్ని భాస్కర్‌ ఫ్యామిలీ మెయిన్‌టెనెన్స్‌కి, బాబు ట్రీట్‌మెంట్‌కి ఉపయోగిస్తున్నారు. బ్యాలెన్స్‌ అమౌంట్‌తోపాటు ప్రతి ఏడాది ఆ డిపాజిట్‌కి వచ్చే ఇంట్రెస్ట్‌ వీరి ఫ్యామిలీకి వచ్చేలా ఏర్పాటు చేశాం.


బాబు బాగా రికవరీ అవుతున్నాడు. అది సంతోషాన్ని కలిగించే విషయం. భాస్కర్‌ ఫ్యామిలీకి 2 కోట్ల రూపాయలు ఇవ్వడంతోపాటు హాస్పిటల్‌కి సంబంధించి ఇప్పటివరకు అయిన ఖర్చు 70 లక్షల రూపాయలు కూడా అల్లు అర్జున్‌గారే పే చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్‌ నుంచి, అరవింద్‌గారి నుంచి ఎక్స్‌ట్రా సపోర్ట్‌ కోసం నన్ను అడిగారు భాస్కర్‌. మరో ఆరు నెలలు ట్రీట్‌మెంట్‌ కంటిన్యూ చేస్తే మరింత బెటర్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని డాక్టర్స్‌ చెప్పారని భాస్కర్‌ అన్నారు. ఆరు నెలలు కాదు, సంవత్సరం అయినా అక్కడే ఉంచి ట్రీట్‌మెంట్‌ చేయించమని చెప్పాను. దాని గురించి నేను మాట్లాడతాను అని భాస్కర్‌కి ధైర్యం చెప్పాను' అన్నారు.


శ్రీతేజ్‌ తండ్రి భాస్కర్‌ మాట్లాడుతూ 'ఇన్సిడెంట్‌ జరిగిన రోజు మేం ఏదైతే సపోర్ట్‌ కోరుకున్నామో అది అల్లు అర్జున్‌గారి ద్వారా మా బాబుకి అందుతోంది. బాబు రికవరీ అవుతున్నాడు. మాకు సంతోషంగా ఉంది. అలాగే నేను అడిగిన ఎక్స్‌ట్రా సపోర్ట్‌ కూడా చేస్తామని చెప్పారు' అన్నారు.