English | Telugu

అలా రిలీజ్‌ అవుతున్న మొదటి సినిమా అఖండ2.. నిర్మాతలు సేఫ్‌ అవుతారా?

కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గింది. దానికి కారణం.. ఆ సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ మంచి ఫామ్‌లోకి రావడమే. థియేటర్లకు వెళ్ళకుండా ఇంటి నుంచే సినిమాలు చూడడం ప్రేక్షకులకు బాగా అలవాటైంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ స్టార్‌ హీరోల సినిమాలకు రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఎక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేసేవారు. దాంతో థియేట్రికల్‌ వసూళ్లు తగ్గినా ఓటీటీ ఇచ్చే అమౌంట్‌ నిర్మాతలకు ఊరట కలిగించేది.


ఇప్పుడు పరిస్థితి మారింది. సినిమాకి సంబంధించిన లెక్కలు కూడా పూర్తిగా మారబోతున్నాయి. ఇకపై రిలీజ్‌ అయ్యే సినిమాలకు సంబంధించి కొత్త లెక్కల్ని అమలులోకి తెచ్చాయి ఓటీటీ సంస్థలు. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఈ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. దానికి లోబడి ఉంటేనే సినిమాలను కొనుగోలు చేస్తోంది. నెట్‌ఫిక్స్‌ పెడుతున్న కండిషన్లకు నిర్మాతలు ఓకే చెబితేనే డీల్‌ ఓకే చేసుకుంటోంది.


సినిమా రిలీజ్‌కి ముందు చేసుకున్న అగ్రిమెంట్‌లో కొన్ని నిబంధనలను చేర్చింది నెట్‌ఫ్లిక్స్‌. సినిమా రిజల్ట్‌ని బట్టి అమౌంట్‌ ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టింది. దీన్ని బట్టి సినిమాకి హిట్‌ టాక్‌ రాకపోతే అగ్రిమెంట్‌ ప్రకారం చెల్లించే మొత్తంలో 25 శాతం కోత విధిస్తారు. సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకొని కలెక్షన్లు బాగుంటే ముందుగా అనుకున్న మొత్తాన్ని ఎలాంటి కోత లేకుండా చెల్లిస్తారు.


ఈ కొత్త నిబంధన నిర్మాతలపై ఒత్తిడి తెస్తోంది. సినిమా విడుదలైన నాలుగు వారాలకే సినిమా ఓటీటీకి వచెయ్యడంతో థియేటర్లలో కలెక్షన్లు బాగా పడిపోతున్నాయి. దానివల్ల చాలా సినిమాలకు లభించే అమౌంట్‌ తగ్గుతుంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన 'అఖండ2' ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 5న విడుదల కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌ విధించిన కొత్త నిబంధనలతో విడుదలవుతున్న మొదటి భారీ సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాకి ఎలాంటి రిజల్ట్‌ వస్తుంది? నెట్‌ఫ్లిక్స్‌ ఎంత ఎమౌంట్‌ చెల్లిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.