English | Telugu

స్టూడియో నిర్మాణానికి అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డిని కోరిన అజయ్ దేవగన్  

స్టూడియో నిర్మాణానికి అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డిని కోరిన అజయ్ దేవగన్  

హిందీ చిత్ర రంగంలో ప్రముఖ హీరో 'అజయ్ దేవ్ గన్'(Ajay Devgn)కి ప్రత్యేకమైన స్థానం ఉంది. 1991 లో 'పూల్ ఔర్ కాంటే' తో సినీ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో తనదైన శైలిలో నటించి యాక్షన్ హీరోగా ఎంతో మంది అభిమానులని సంపాదించాడు. 'ఆర్ఆర్ఆర్'(RRR)లో 'రామ్ చరణ్'(Ram Charan)కి తండ్రిగా, దేశం కోసం  ప్రాణాలని తృణప్రాయంగా అర్పించే వీరుడుగా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకి కూడా  దగ్గరయ్యాడు.  మే 1 న విడుదలైన 'రెయిడ్ పార్ట్ 2 ' తో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటాడు.

రీసెంట్ గా అజయ్ దేవగన్ ఢిల్లీలో 'తెలంగాణ'(Telangana)ముఖ్యమంత్రి 'రేవంత్ రెడ్డి'(Revanth Reddy)ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో అజయ్ దేవగన్ మాట్లాడుతు సినీ నిర్మాణంలో కీల‌క‌మైన యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇత‌ర స‌దుపాయాల‌తో పాటు అంతర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన‌ స్టూడియో నిర్మాణానికి తెలంగాణాలో అవ‌కాశం క‌ల్పించాలని, స్టూడియో నిర్మాణంతో పాటు సినీ ప‌రిశ్ర‌మ‌లో వివిధ విభాగాల‌కు అవ‌స‌ర‌మైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్ష‌ణ కేంద్రం ఏర్పాటు చేస్తామని అజ‌య్ దేవ‌గ‌ణ్ తన సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు. తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి మీడియా, సినిమా రంగాల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా ఉంటాన‌ని కూడా రేవంత్ రెడ్డితో అజయ్ దేవగన్ చెప్పినట్టుగా తెలుస్తుంది.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సినీ రంగంతో పాటు, వివిధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను అజయ్ దేవగన్ కి  రేవంత్ రెడ్డి వివరించారు. అనంతరం అజయ్ దేవగన్ ని శాలువాతో సత్కరించారు. తన కెరీర్ లో ఇప్పటి వరకు వంద సినిమాల దాకా పని చేసిన అజయ్ దేవగన్ కేంద్ర ప్రభుత్వం అందించే  దేశ నాల్గవ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ ని కూడా అందుకున్నాడు.నాలుగు నేషనల్ ఫిలిం అవార్డ్స్ తో పాటు నాలుగు సార్లు ఫిలిం ఫేర్ అవార్డ్స్  కూడా అందుకున్నాడు.