English | Telugu
ఎన్టీఆర్-నీల్ మూవీ ఆగిపోయిందా?.. అసలేం జరిగింది?
Updated : Oct 21, 2025
టాలీవుడ్ లో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'డ్రాగన్' ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే కొంత పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ కూడా కొద్దిరోజులు షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే ప్రజెంట్ 'డ్రాగన్' మూవీ షూటింగ్ కి చిన్న బ్రేక్ వచ్చింది. దీంతో రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. (NTR Neel)
ఇప్పటివరకు షూట్ చేసిన 'డ్రాగన్' అవుట్ పుట్ పట్ల ఎన్టీఆర్ సంతృప్తిగా లేడని.. అందుకే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి, స్క్రిప్ట్ పై మళ్ళీ వర్క్ చేయమని చెప్పాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ విషయంలో ఎన్టీఆర్-నీల్ మధ్య విభేదాలు కూడా తలెత్తాయని, ఇవి ముదిరి ప్రాజెక్ట్ ఆగిపోయే ప్రమాదం వచ్చిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. (Dragon)
ఫైనల్ స్క్రిప్ట్ ని లాక్ చేసే విషయంలో ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో శైలి. అలాగే, ప్రశాంత్ నీల్ కి కూడా ఓ ప్రత్యేకమైన శైలి ఉందనేది ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పే మాట. అదేంటంటే, కొంత పార్ట్ షూటింగ్ పూర్తయ్యాక.. చిన్న బ్రేక్ తీసుకొని, స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతారట. కేజీఎఫ్, సలార్ సినిమాలకు అలాగే చేశారు. ఇప్పుడు డ్రాగన్ కి కూడా అదే ఫాలో అవుతున్నారని అంటున్నారు.
ఎన్టీఆర్-నీల్ మధ్య మంచి బాండింగ్ ఉంది. సినిమాతో సంబంధం లేకుండానే ఎప్పటినుంచో ఇద్దరూ ఫ్రెండ్స్. పైగా, ఎన్టీఆర్ కోసం రాసిన ఈ కథ తన డ్రీం ప్రాజెక్ట్ అన్నట్టుగా గతంలో నీల్ చెప్పాడు. అలాంటిది వీరి మధ్య విభేదాలు ఏంటని సన్నిహితులు ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. "డ్రాగన్ అవుట్ పుట్ పట్ల ఎన్టీఆర్ సంతృప్తిగా లేడు.. ఎన్టీఆర్-నీల్ మధ్య విభేదాలు.. సినిమా ఆగిపోయే ప్రమాదం" అంటూ జరుగుతున్న ప్రచారాల్లో ఏమాత్రం వాస్తవం లేదని చెబుతున్నారు. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. వచ్చే మూడు నాలుగు నెలలపాటు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో మెజారిటీ షూటింగ్ పూర్తి కానుందని వినికిడి.