English | Telugu

చైతూ `రారండోయ్.. వేడుక చూద్దాం`కి ఐదేళ్ళు!

రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన ఈ త‌రం క‌థానాయ‌కుల్లో యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య ఒక‌రు. చైతూ హోమ్ బేన‌ర్ అన్న‌పూర్ణ స్టూడియోస్ ప‌తాకంపై నిర్మిత‌మైన‌ `రారండోయ్.. వేడుక చూద్దాం` కూడా అచ్చంగా ఆ త‌ర‌హా చిత్ర‌మే. కింగ్ నాగార్జున‌తో `సోగ్గాడే చిన్ని నాయ‌నా`(2016) వంటి విజ‌య‌వంత‌మైన సినిమాని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణకి ద్వితీయ ప్ర‌య‌త్న‌మిది. ఇందులో చైతూకి జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించ‌గా జ‌గ‌ప‌తిబాబు, సంప‌త్ రాజ్, కౌస‌ల్య‌, ప్రియ‌, వెన్నెల కిశోర్, అన్న‌పూర్ణ‌, చ‌ల‌ప‌తిరావు, అనితా చౌద‌రి, పోసాని కృష్ణ‌ముర‌ళి, సురేఖా వాణి, ర‌ఘుబాబు, స‌ప్త‌గిరి, మ‌ధునంద‌న్, హైప‌ర్ ఆది, స‌త్య కృష్ణ‌న్, ర‌జిత తదిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ఆక‌ట్టుకున్నారు. శివ (చైతూ), భ్ర‌మ‌రాంబ (ర‌కుల్) మ‌ధ్య సాగే విభిన్న ప్రేమ‌క‌థే.. `రారండోయ్ వేడుక చూద్దాం` చిత్రం.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీల‌కు అనుగుణంగా రామ‌జోగ‌య్య‌శాస్త్రి, భాస్క‌ర‌భ‌ట్ల‌, శ్రీ‌మ‌ణి సాహిత్య‌మందించారు. ``రారండోయ్ వేడుక చూద్దాం``, ``భ్ర‌మ‌రాంబ‌``, ``నీవెంటే నేనుంటే``, ``త‌కిట త‌క‌ఝుమ్``, ``బ్రేక్ అప్``.. ఇలా ఇందులోని పాట‌ల‌న్నీ కూడా రంజింప‌జేశాయి. 2017 మే 26న విడుద‌లై మంచి విజ‌యం సాధించిన `రారండోయ్.. వేడుక చూద్దాం`.. నేటితో 5 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంది.