English | Telugu
నందమూరి హీరో రీ-ఎంట్రీ.. ఆ విషాద ఘటనతో 35 ఏళ్ళు నటనకు దూరం!
Updated : Dec 6, 2025
35 ఏళ్ళ తర్వాత నందమూరి హీరో రీ ఎంట్రీ
అప్పట్లో డ్రీమ్ బోయ్ గా మంచి పేరు
ఒక్క విషాద ఘటనతో నటనకు దూరం
ఇప్పుడు ఛాంపియన్ గా కమ్ బ్యాక్
నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. ఈ తరం వారికి ఈ పేరు పెద్దగా తెలిసుండదు. కానీ, అప్పట్లో తక్కువ సినిమాలతోనే తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు కళ్యాణ్ చక్రవర్తి. అయితే ఒక విషాద ఘటన వల్ల ఆయన నటనకు దూరమయ్యారు. లేదంటే, నటుడిగా వందల సినిమాలు చేసేవారు. అలాంటి కళ్యాణ్ చక్రవర్తి, ఏకంగా 35 ఏళ్ళ తర్వాత ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నారు. (Nandamuri Kalyan Chakravarthy)
నందమూరి తారక రామారావు సోదరుడు త్రివిక్రమరావు కుమారుడైన కళ్యాణ్ చక్రవర్తి.. 1986లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'అత్తగారూ స్వాగతం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. కథానాయకుడిగానే కాకుండా, సహాయ నటుడిగానూ నటించి విభిన్న పాత్రలతో మెప్పించారు. కెరీర్ స్టార్టింగ్ లో డ్రీమ్ బోయ్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన కెరీర్ లో తలంబ్రాలు, కృష్ణ లీల, ఇంటి దొంగ, మేనమామ, రౌడీ బాబాయ్, లంకేశ్వరుడు వంటి సినిమాలు ఉన్నాయి.
నటుడిగా బిజీగా ఉన్న సమయంలో కళ్యాణ్ చక్రవర్తి ఇంట విషాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఆయన సోదరుడు హరిన్ చక్రవర్తి మరణించారు. అదే ప్రమాదంలో తన తండ్రి త్రివిక్రమరావు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తండ్రిని చూసుకోవడం కోసం తన నట జీవితాన్ని త్యాగం చేసి, చెన్నైలోనే ఉండిపోయారు కళ్యాణ్ చక్రవర్తి.
Also Read: టాలీవుడ్ ని భయపెడుతున్న డిసెంబర్ 4
35 ఏళ్ళ తర్వాత కళ్యాణ్ చక్రవర్తి రీ ఎంట్రీ ఇస్తున్నారు. రోషన్ మేకా హీరోగా వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న 'ఛాంపియన్' సినిమాలో రాజిరెడ్డి అనే పాత్ర పోషిస్తున్నారు కళ్యాణ్ చక్రవర్తి. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. రాజిరెడ్డిగా ఆయన పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. డిసెంబర్ 25న విడుదలవుతున్న 'ఛాంపియన్' మూవీ కళ్యాణ్ చక్రవర్తి సెకండ్ ఇన్నింగ్స్ కి శుభారంభాన్ని ఇస్తుందేమో చూడాలి.
కాగా, మధ్యలో 2003లో వచ్చిన 'కబీర్ దాస్' సినిమాలో శ్రీరాముడి పాత్రలో కాసేపు కనిపించారు కళ్యాణ్ చక్రవర్తి. పూర్తిస్థాయిలో నటుడిగా మాత్రం ఇన్నేళ్లకు రీ ఎంట్రీ ఇస్తున్నారు.