English | Telugu

ఎన్టీఆర్ ని దారుణంగా మోసం చేసిన మహిళ!

స్థలాల విషయంలో సామాన్యులు మోసపోవడం తరచూ చూస్తుంటాం. అయితే ఒక్కోసారి ఎంతో పలుకుబడి ఉన్నవారు, సెలబ్రిటీలు కూడా మోసపోతుంటారు. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కి అలాంటి అనుభవమే ఎదురైంది.

2003లో సుంకు గీత అనే మహిళ నుంచి జూబ్లీహిల్స్ లో 681 చదరపు గజాల స్థలం కొనుగోలు చేశాడు ఎన్టీఆర్. ఆ స్థలంలోనే తన డ్రీం హౌస్ ని కట్టుకొని కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆ స్థలం, అందులో నిర్మించిన ఇంటి ఖరీదు కొన్ని కోట్లల్లో ఉంటుంది. అలాంటిది ఆ ఇంటి స్థలం ఓ వివాదంలో చిక్కుకుంది. ఆ స్థలాన్ని అమ్మిన సుంకు గీత.. 1996లోనే బ్యాంకులకు తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. ఆమె ఆ విషయాన్ని దాచి, ఎన్టీఆర్ కి స్థలం అంటగట్టి దారుణంగా మోసం చేశారు. పైగా గీత రుణాలు ఎగ్గొట్టడంతో.. ఆమెకి రుణాలు ఇచ్చిన ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లు.. 'డెట్ రికవరీ ట్రిబ్యునల్'ను ఆశ్రయించాయి. విచారణ జరిపిన ట్రిబ్యునల్.. ఆ స్థలంపై బ్యాంకులకే హక్కు ఉంటుందని తీర్పు ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్.. స్థలాన్ని, అందులో నిర్మించుకున్న ఇంటిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అందుకే ఎన్టీఆర్ న్యాయ పోరాటానికి దిగాడు. తనని మోసం చేశారంటూ ఆయన ఫిర్యాదు చేయడంతో.. గీతపై కేసు నమోదైంది. అలాగే ట్రిబ్యునల్ తీర్పుపై కూడా ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించాడు. జూన్ 6న దీనిపై విచారం జరగనుంది.

కాగా, ఓ స్టార్ హీరో.. దానికితోడు రాజకీయంగానూ ఎంతో పలుకుబడి ఉన్న ఎన్టీఆర్ కి ఇలా జరగడం సంచలనంగా మారింది.