English | Telugu

నువ్వు మారవా ఇక!

లక్షల మంది అభిమానంతో స్టార్ గా ఎదగడమే కాదు.. స్టార్ గా ఎదిగిన తరువాత ఆ అభిమానాన్ని కాపాడుకోవడం కూడా ఎంతో ముఖ్యం. అయితే టాలీవుడ్ స్టార్స్ లో ఒకరైన అల్లు అర్జున్ (Allu Arjun) కి ఈ తత్త్వం బోధపడట్లేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకప్పుడు అల్లు అర్జున్.. తాను మెగా హీరోనని, మెగా అభిమానుల వల్లే ఈ స్థాయికి వచ్చానని చెప్పుకునేవాడు. కానీ కొన్నేళ్లుగా ఆయన స్వరంలో మార్పు వచ్చింది. తనపై మెగా హీరో అనే ముద్ర పోగొట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన వేస్తున్న కొన్ని అడుగులు మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

గతంలో "చెప్పను బ్రదర్" అంటూ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురైన బన్నీ.. ఇక ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలపడం మెగా ఫ్యామిలీకి, ఫ్యాన్స్ కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అల్లు అర్జున్ పై సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ దారుణంగా విమర్శలు చేశారు. ఇక మీదట ఆయన సినిమాలను థియేటర్లలో చూసేది లేదని తీర్మానం చేసుకున్నారు. అయితే రీసెంట్ గా బన్నీ పిల్లలను చిరంజీవి ప్రేమగా పలకరించిన వీడియో ఒకటి బయటకు రావడంతో.. మెగా ఫ్యాన్స్ కొంతవరకు కూల్ అయ్యారు. ఇక చిన్నగా అంతా సద్దుమణుగుతుంది అనుకుంటున్న సమయంలో.. అల్లు అర్జున్ మరోసారి మెగా ఫ్యాన్స్ కి చిర్రుత్తేలా చేశాడు.

రీసెంట్ గా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరైన అల్లు అర్జున్.. నంద్యాల ఇష్యూ గురించి పరోక్షంగా మాట్లాడుతూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. "ఇష్టమైనవాళ్ల కోసం మనం నిలబడగలగాలి. అది మన ఫ్రెండ్ అనుకో.. ఇంకొకళ్లు అనుకో. నాకిష్టమైతే వస్తా.. నా మనసుకి నచ్చితే వస్తా.." అని బన్నీ అన్నాడు. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ, తన ఫ్రెండ్ రవిచంద్ర కోసం నంద్యాల వచ్చానని చెప్పాడు. ఇప్పుడు కూడా అదే అర్థం వచ్చేలా "నాకిష్టమైతే వస్తా" మరోసారి అన్నాడు. అంతేకాదు ఈ ఈవెంట్ లో ఫ్యాన్స్ ని ఉద్దేశించి బన్నీ చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్ గా మారాయి. "నా ఫ్యాన్స్.. నా ఫ్యాన్స్" అంటూ బన్నీ పదే పదే నొక్కి చెప్పాడు. అక్కడితో ఆగకుండా "హీరోని చూసి అందరూ ఫ్యాన్స్ అవుతారు.. కానీ నేను నా ఫ్యాన్స్ ని చూసి హీరోని అయ్యాను" అంటూ చెప్పుకొచ్చాడు.

నంద్యాల ఘటనను ఇప్పుడిప్పుడే అందరూ మర్చిపోతుండగా "నాకిష్టమైతే వస్తా" అంటూ బన్నీ అనవసరంగా గెలికాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక "నా ఫ్యాన్స్" అనడంపై మెగా ఫ్యాన్స్ గట్టిగా ఫైర్ అవుతున్నారు. నువ్వు ఇక మారవా? అని విరుచుకుపడుతున్నారు. ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ వల్లే ఇక్కడికి దాకా వచ్చానని చెప్పి, ఇప్పుడు నా ఫ్యాన్స్ అంటావా అంటూ.. బన్నీ ఓల్డ్ వీడియోస్ పోస్ట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. "ఫ్యాన్స్ ని చూసి హీరో అవ్వడం ఏంటి.. అసలు హీరో అవ్వకుండా ఫ్యాన్స్ ఎలా వస్తారు.." అంటూ ఒక ఆట ఆడేసుకుంటున్నాడు. ఇక మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కి ఎటువంటి సంబంధం లేదని, ఆయన సినిమాలను ఎట్టి పరిస్థితుల్లో చూసేది లేదని మెగా ఫ్యాన్స్ స్ట్రాంగ్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మెగా ఫ్యాన్స్ ఇక ఎప్పటికీ కూల్ అవ్వని స్థాయిలో బన్నీ కామెంట్స్ ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బన్నీ అభిమానులు కూడా తమ హీరో.. తన మాటలు, చర్యలతో అనవసరమైన వివాదాలకు తెరదీస్తున్నాడని అసహనం వ్యక్తం చేస్తున్నాడు. తాజా కామెంట్స్ తో బన్నీ సరిదిద్దుకోలేని తప్పు చేశాడని, దీని వల్ల భారీ నష్టం తప్పదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ చేసిన తాజా వ్యాఖ్యలతో ఆయన నెక్స్ట్ మూవీ 'పుష్ప-2' వసూళ్లపై తెలుగునాట తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది అంటున్నారు. ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడంలో తప్పులేదు కానీ.. ఈ క్రమంలో తన పునాదులే కదిలే అడుగులు వేయడం కరెక్ట్ కాదని సూచిస్తున్నారు. మరి బన్నీ ఇకనైనా తన తీరుని మార్చుకొని, అవసరమైన వివాదాలకు దూరంగా ఉంటాడేమో చూడాలి.