English | Telugu

షాకింగ్.. మరోసారి వాయిదా పడిన మాస్ జాతర..!

మాస్ మహారాజా రవితేజ (RaviTeja) అప్ కమింగ్ మూవీ 'మాస్ జాతర' (Mass Jathara). అక్టోబర్ 31 ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా.. మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'మాస్ జాతర'. భాను బోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. మొదట 2025 సంక్రాంతికి వస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత మేకి, దాని నుంచి ఆగస్టుకి వాయిదా పడింది. చివరికి అక్టోబర్ 31కి వస్తున్నట్లు ప్రకటించారు. విడుదలకు ఇంకా ఐదు రోజులే సమయముంది. అక్టోబర్ 27న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. ఇలాంటి సమయంలో 'మాస్ జాతర' మరోసారి వాయిదా పడనుందన్న వార్త ఆసక్తికరంగా మారింది. ఈ వాయిదాకి కారణం 'బాహుబలి' అని తెలుస్తోంది.

బాహుబలి రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31న రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో 'మాస్ జాతర' ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా సినిమాని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. దీంతో 'మాస్ జాతర' నవంబర్ 1న విడుదల కానుంది. అక్టోబర్ 31 రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.