English | Telugu
Jatadhara Review: జటాధర మూవీ రివ్యూ
Updated : Nov 7, 2025
తారాగణం: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, ఇందిర కృష్ణ, రవిప్రకాష్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, ప్రదీప్ రావత్ తదితరులు
సంగీతం: రాజీవ్ రాజ్
డీఓపీ: సమీర్ కళ్యాణి
ఆర్ట్: ప్రభాత్ ఠాకూర్
రచన: వెంకట్ కళ్యాణ్
దర్శకత్వం: వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్
బ్యానర్స్: ఎస్కేజీ ఎంటర్టైన్మెంట్, జీ స్టూడియోస్
విడుదల తేదీ: నవంబర్ 7, 2025
ఈ మధ్య కాలంలో డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. అందుకే జటాధర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో.. ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలక పాత్ర పోషించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సుధీర్ బాబు ఖాతాలో హిట్ పడిందా? టాలీవుడ్ లో సోనాక్షి సిన్హాకు శుభారంభం దక్కిందా? (Jatadhara Movie Review)
కథ:
ఆత్మలు ఉన్నాయని నమ్మకం లేని ఒక ఘోస్ట్ హంటర్ శివ(సుధీర్ బాబు). చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన వల్ల.. అసలు ఆత్మలు, దెయ్యాలు లాంటివి లేవని నిరూపించాలనే ప్రయత్నంలో ఉంటాడు. ఈ క్రమంలోనే ఘోస్ట్ హంటర్ గా మారి.. దెయ్యాల బంగ్లాలుగా పేరు పడిపోయిన పలు చోట్ల రీసెర్చ్ చేస్తుంటాడు. అలాంటి శివకు నిజంగానే ఆత్మలు కనిపిస్తాయి. అంతేకాదు, తన ప్రాణాలకు తెగించి ధన పిశాచి(సోనాక్షి సిన్హా)తో పోరాడాల్సి వస్తుంది. అసలు శివ ఎవరు? అతనికి కలలో తరచూ కనిపించే పిల్లాడు ఎవరు? అతన్ని వెంటాడుతున్న గతం ఏంటి? ఈ కథకి లంకె బిందెలకు ఉన్న లింకేంటి? శివ చావు కోసం ధన పిశాచి ఎందుకు ఎదురు చూస్తుంది? ఆ పిశాచి నుండి శివ ప్రాణాలతో బయటపడగలిగాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
పూర్వం బంగారాన్ని లంకె బిందెల రూపంలో భూమిలో దాచిపెట్టేవాళ్ళు. అంతేకాదు, వాటిని ఎవరూ దోచుకోకుండా ఉండటం కోసం బంధనాలు వేసేవాళ్ళు. ఆ బంధనాలలో పిశాచ బంధనం అత్యంత శక్తివంతమైనది. ఆ పిశాచ బంధనాలలో ఒకటి 'ధన పిశాచి'. క్షుద్ర పూజలు చేసి, ధన పిశాచి కోరిన బలి ఇస్తే తప్ప.. ఆ లంకె బిందెలను సొంతం చేసుకోవడం సాధ్యంకాదు. ఒక్కసారి ఆ ధన పిశాచిని నిద్ర లేపి, దానిని శాంతిపరచలేకపోయారంటే.. ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంటుంది. అలాంటి ఒక ధన పిశాచితో కథానాయకుడు ప్రాణాలకు తెగించి ఎలా పోరాడాడు? అనేదే ఈ కథ.
స్టోరీ లైన్ బాగానే ఉంది. కానీ ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ ని స్టార్టింగ్ లో వాయిస్ ఓవర్ లోనే దాదాపు చెప్పేసి.. కథాకథనాలను మాత్రం పేలవంగా రాసుకున్నారు. రచన పూర్తిగా తేలిపోయింది. ఎక్కడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. శివగా సుధీర్ బాబు పాత్ర పరిచయం కానీ, ఘోస్ట్ హంటింగ్ సన్నివేశాలు కానీ.. ఆసక్తికరంగా లేవు. స్టార్టింగ్ లో కామెడీ ట్రై చేశారు.. అది వర్కౌట్ కాలేదు. లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకునేలా లేదు.
ఇలాంటి సినిమాలు ప్రేక్షకులకు భయాన్ని కలిగిస్తూ థ్రిల్ ని పంచాలి. కానీ, ఒక్క సన్నివేశం కూడా అలాంటి అనుభూతిని కలిగించదు. ఘోస్ట్ హంటింగ్ సీన్స్ ఏమాత్రం ఎఫెక్టివ్ గా లేవు. కొన్ని సన్నివేశాలు పేపర్ మీద బాగానే రాసుకున్నప్పటికీ, వాటిని తెరమీదకు తీసుకురావడంలో తడబడ్డారు. ఎడిటింగ్, మ్యూజిక్ విభాగాల పేలవ పనితీరు కూడా ఆ సన్నివేశాలు ప్రభావవంతంగా లేకపోవడానికి కారణమయ్యాయి.
శివ ఘోస్ట్ హంటింగ్ సన్నివేశాలతోనే దాదాపు ఫస్ట్ హాఫ్ అంతా నడిచింది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా పెద్దగా సర్ ప్రైజ్ చేయదు. సెకండాఫ్ ధన పిశాచి చుట్టూ ప్రధానంగా నడుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఓకే ఓకే. ధన పిశాచి ఎంత పవర్ ఫుల్ అనేది ఎక్కువగా మాటల రూపంలోనే చెప్పారు. దాంతో, ఆ ధన పిశాచితో పోరాడి హీరో ఎలా గెలుస్తాడు? అనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో పెద్దగా కలగదు.
అష్ట లింగాల సాయంతో ధన పిశాచిని కంట్రోల్ చేయాలనే కాన్సెప్ట్ తో పతాక సన్నివేశాలను రాసుకోవడం బాగుంది. కానీ, దానిని కూడా ప్రభావంతంగా తెరకెక్కించలేకపోయారు. సినిమాలో వావ్ మూమెంట్స్ కానీ, గుర్తుంచుకోదగ్గ ఎలిమెంట్స్ కానీ పెద్దగా లేవు. పైగా, కొన్ని కొన్ని చోట్ల.. ఆ రైటింగ్, మేకింగ్, యాక్టింగ్, వీఎఫ్ఎక్స్ అన్నీ కలిసి.. హిందీ డబ్బింగ్ సీరియల్ చూస్తున్నామా అనే అనుమానాన్ని కూడా కలిగిస్తాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
ఘోస్ట్ లు ఉన్నాయని నమ్మకం లేని ఘోస్ట్ హంటర్ శివ పాత్రలో సుధీర్ బాబు బాగానే నటించాడు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో రాణించాడు. ధన పిశాచి పాత్రలో సోనాక్షి సిన్హా మెప్పించలేకపోయింది. ఆ పాత్రను డిజైన్ చేసిన తీరే అలా ఉంది. అరుపులు, నవ్వులతో ఆమె చేసే లౌడ్ యాక్టింగ్.. భయం పుట్టించకపోగా, ఇరిటేషన్ తెప్పిస్తుంది. శిల్పా శిరోద్కర్, ఇందిర కృష్ణ, రవిప్రకాష్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, ప్రదీప్ రావత్ తదితరులు పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతిక విభాగాల పనితీరు కూడా గొప్పగా లేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. సంగీతం ప్రభావం చూపలేదు. ఎడిటింగ్ బెటర్ గా ఉండాల్సింది. వీఎఫ్ఎక్స్ వర్క్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నిర్మాణ విలువలు పరవాలేదు.
ఫైనల్ గా..
జటాధర.. టైటిల్ లో ఉన్న పవర్ సినిమాలో లేదు...
రేటింగ్: 2/5
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them.