English | Telugu

పైరసీ పేరుతో 50 లక్షల మంది డేటా చోరీ.. ఐ బొమ్మ రవి అసలు ప్లాన్ ఇదే!

ఐ బొమ్మ రవిది క్రిమినల్ మైండ్
పైరసీ సైట్ వెనుక పెద్ద రాకెట్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, డేటా చోరీ
ఇమ్మడి రవి దగ్గర 50 లక్షల మంది డేటా

పైరసీ వెబ్ సైట్ 'ఐ బొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వేల సినిమాలను పైరసీ చేసి, సినీ పరిశ్రమకు ఎంతో నష్టం కలిగించిన రవిని అరెస్ట్ చేయడంతో.. సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇమ్మడి రవి అరెస్ట్ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ తో సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు భేటీ అయ్యారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ పైరసీ వెనుక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, డేటా చోరీ ఉన్నాయని.. ఇటువంటి సైట్స్ ఉపయోగించడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సజ్జనార్ మాట్లాడుతూ.. "ఇమ్మడి రవి ది వైజాగ్. ముందు నుంచే క్రిమినల్ మైండ్ ఉంది. పైరసీ ముసుగులో ఆన్లైన్ బెట్టింగ్ ను ప్రమోట్ చేశాడు. ఐ బొమ్మ సైట్ ను క్లిక్ చేయగానే.. బెట్టింగ్ యాప్ సైట్ ఓపెన్ అవుతుంది. సినిమా మధ్యలో కూడా బెట్టింగ్ యాప్ ప్రకటనలు వచ్చాయి. వీటి ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాడు. ఫ్రీగా వస్తుంది కదా అని ఐ బొమ్మను ఎంకరేజ్ చేశారు. కానీ మీ డేటా మొత్తం చోరీకి గురైంది. ఆ విషయం మర్చిపోయారు. దాదాపు 50 లక్షల మంది డేటా అతని దగ్గర ఉంది. ఆ డేటాను సైబర్ మోసాలకు ఉపయోగించే అవకాశముంది. పైరసీ అనేది ఇల్లీగల్. దాని వెనుక ఇంకా పెద్ద రాకెట్ ఉందని ప్రజలు గుర్తించాలి. ప్రజల డేటాను ఏం చేశారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కొన్ని నెలల పాటు శ్రమించి ఇమ్మడి రవిని పట్టుకున్నాము." అన్నారు.

Also Read: హైదరాబాద్ లో బాలీవుడ్ స్టార్స్ స్టూడియోలు.. ఒక్కో స్టూడియోకి ఎన్ని ఎకరాలంటే..?

చిరంజీవి మాట్లాడుతూ.. "చాలా ఏళ్లుగా పైరసీ బాధించింది. లక్షలాది మంది సినిమా ఇండస్ట్రీ పై ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు వచ్చి అప్పనంగా ఎత్తుకుపోతే ఎలా?.. గత సీపీ ఆనంద్, ప్రస్తుత సీపీ సజ్జనార్ ఇద్దరు ఎంతో శ్రమించి పైరసీ భూతాన్ని పట్టుకున్నారు. పోలీస్ శాఖ కి మా కృతజ్ఞతలు." అన్నారు.

రాజమౌళి మాట్లాడుతూ.. "పోలీసులకు సవాల్ చేసి.. భస్మాసుర హస్తంలా తన తల మీద తానే చెయ్యి పెట్టుకున్నాడు ఇమ్మడి రవి. ఏది ఊరికే రాదు.. ఐ బొమ్మ లో ఉచితంగా సినిమాలు ఎలా వస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించారా..? మీ పర్సనల్ డేటా ఇమ్మడి రవి అమ్ముకుంటున్నాడు. అంత పెద్ద సర్వర్లు మెయింటెన్ చేయాలి అంటే ఎంతో డబ్బు కావాలి. ఆ డబ్బంతా మీరే(ప్రేక్షకులే) ఇస్తున్నారు. మా సినిమా వాళ్ళ కంటే.. మీరే ఎక్కువగా నష్టపోతున్నారు." అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ.. "తెలంగాణ పోలీస్ శాఖకి కృతజ్ఞతలు. ఐ బొమ్మ రవి అరెస్ట్ అవగానే.. చెన్నై నుంచి ఒక వ్యక్తి కాల్ చేశాడు. ఇక్కడ మేము చేయలేని పని మీ తెలంగాణ పోలీస్ చేశారని గర్వంగా చెప్పాడు. 50 లక్షల మంది పర్సనల్ డేటా చోరీ అయ్యింది. ఉచితంగా సినిమా చూస్తున్నాం అని మాత్రం అనుకోకండి. మీ డేటా చోరీ అవుతుంది అనేది గుర్తుంచుకోండి." అన్నారు.

సైబర్ క్రైమ్ లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అధికారులమంటూ ఫోన్ చేసి, డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులకు పాల్పడి.. డబ్బులు కొట్టేసే ప్రయత్నం చేస్తుంటారు కొందరు. ఇటువంటి ఘటన ఇటీవల నాగార్జున ఫ్యామిలీ మెంబర్ కి ఎదురైందట. ఈ మీడియా సమావేశంలో ఆ విషయాన్ని కూడా పంచుకున్నారు నాగార్జున.

"ఆరు నెలల క్రితం మా ఫ్యామిలీ మెంబర్ ఒకరిని రెండు రోజులపాటు డిజిటల్ అరెస్ట్ లో పెట్టారు. దీంతో మేము పోలీసులకు సమాచారం ఇచ్చాం." అని నాగార్జున తెలిపారు.