English | Telugu

సరస్వతి పలికిన రోజు... సిరివెన్నెల పుట్టినరోజు

తేనేలాంటి తీయని పదాలు ఆయనవి
చురకత్తి లాంటి పదునైన భావం ఆయనది
అంతేనా
వెన్నెలంత చల్లనిది ఆయన పాట
అమ్మ ఒడి అంత వెచ్చనిది ఆయన పాట
చంటిపాప బోసినవ్వు అంత స్వచ్ఛమైనది ఆయన పాట
ఆయనే మన సినీవినీలాకాశపు పాటల చంద్రుడు
సిరివెన్నెల సీతరామశాస్త్రి

ఎన్నో భావాలు ఆయన కలం నుంచి అవలీలగా జాలువారుతాయి.
విధాత తలపున ప్రభవించినది... అంటూ రాసిన మొదటి పాటతో ఆయన తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ సినిమా పేరు సిరివెన్నెలను ఇంటి పేరుగా సుస్థిరం చేసుకున్న శాస్త్రి గారంటే తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఎవరూ ఉండరు. సీతరామశాస్త్రి గారి 'గంగావతరణం' అనే గేయనాటిక విన్నదర్శకులు విశ్వనాథ్‌ 'సిరివెన్నెల' చిత్రం ద్వారా ఆయనను సినీ పరిశ్రమకు పరిచయం చేస్తే ఆ గేయ నాటిక విన్న బాలసుబ్రహ్మణ్యం, సీతారామశాస్త్రి సినిమా పాటని పాడకుండానే ''మీరు రాసిన వందల పాటలు పాడాలని వుంది'' అని సీతారామశాస్త్రితో అనడం ఆ మాట నిజమవటం అంతా అలా జరిగిపోయింది.



ఆయన పాటలలో ప్రకృతి మీద ప్రేమ ఎంతగా కురిపిస్తారో, సమాజంలో జరుగుతున్న అక్రమాలపై అంతగానే విరుచుకుపడతారు. ఆ క్రమంలో గాయం చిత్రంలోని నిగ్గదీసి అడుగు పాటలో సాగే ప్రతి పదం ఒక చురకత్తిలా తాకుతుంది ఎవరినైనా. చిలకా ఏ తోడు లేక అంటూ విరహం, విషాదం అలుముకున్న మనసు, కన్నుల్లో నీ రూపమే అనే తొలిప్రేమ మనసు తీపిజాలు ఆయన కలం నుంచే పాటలుగా అల్లుకున్నాయి. బోటనీ క్లాసు ఎగ్గోట్టటం, జామురాతిరిలో అందాలసుందరికి జోల పాడటం ఆయనకి ఆటవిడుపే.
వారేవా ఏమి ఫేసు అంటు తేలికైన పదాలతో కమెడియన్‌ని సీరియస్‌గా మెప్పించినా, సాహసమే చేయరా డింబకా అని సరదా అయిన పదాలతో ఉత్సాహం నింపినా ఆయనకే చెల్లు. ప్రేమ లేఖల పాటలు, పుట్టిన రోజు పాటలు, అలకలు, విరహాలు, సరికొత్త ప్రయోగాలు ఇలా, ఆయన తెలుగు పాటల పూదోటలో చేయని తీయని ప్రయోగమంటూ ఏదీ లేదు.
అందుకే ఆయన రాసిన తొలి పాట 'విధాత తలపున ప్రభవించినది'తో ప్రారంభమైన నంది అవార్డ్‌ 'గమ్యం' చిత్రం వరకు అంటే 2008 వరకు పదిసార్లు లభించింది. గొప్ప గాయని గాయకులు అద్భుతంగా పాడినపుడు వింటూ ఎలా ఆనందం పొందుతామో చదివినపుడు కూడా అదే ఆనందం పొందగలిగితే అదే గొప్ప పాటగా నిలిచిపోతుందని నమ్ముతారు. అందుకే గొప్ప పాటలు, అద్భుతమైన పాటలు వెలువడుతాయి ఆయన కలం, గళం నుంచి.
తెలుగును, తెలుగు పాటను అభిమానించే ఎందరికో పూజ్యులు అయిన సిరివెన్నెల గారు ఇలా కలకాలం వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ తెలుగువన్ తరపున ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తున్నాం.