English | Telugu
గోపీచంద్ మాస్.. 'గామి' కంటే 'భీమా' కలెక్షన్స్ ఎక్కువ!
Updated : Mar 12, 2024
గత శుక్రవారం(మార్చి 8) విశ్వక్ సేన్ 'గామి', గోపీచంద్ 'భీమా' సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో 'గామి' పరవాలేదు అనిపించుకోగా, 'భీమా' మాత్రం నెగటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ 'భీమా'కి చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తుండటం విశేషం. ముఖ్యంగా నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో 'గామి' కంటే 'భీమా'కి ఎక్కువ కలెక్షన్స్ రావడం ఆసక్తికరంగా మారింది.
మాస్ హీరోగా మంచి గుర్తింపు ఉన్న గోపీచంద్.. సరైన విజయాన్ని అందుకొని చాలా కాలమవుతోంది. అయినప్పటికీ గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తున్నాయి. ఇప్పుడు 'భీమా' విషయంలో కూడా అదే రిపీట్ అయింది. నాలుగు రోజు తెలుగు స్టేట్స్ లో 'గామి'ని 'భీమా' డామినేట్ చేసింది. 'గామి' రూ.51 లక్షల షేర్ రాబట్టగా.. 'భీమా' రూ.57 లక్షల షేర్ తో సత్తా చాటింది.
అయితే ఓవరాల్ కలెక్షన్స్ లో మాత్రం 'గామి'దే పైచేయి. 'గామి' నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.9.53 కోట్ల షేర్ రాబట్టగా.. 'భీమా' రూ.5.23 కోట్ల షేర్ కే పరిమితమైంది. 'గామి' రూ.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా.. 'భీమా' రూ.11 కోట్ల బిజినెస్ చేసింది. 'గామి' ఈ వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముంది. అయితే 'భీమా'కి మాత్రం నష్టాలు తప్పేలా లేవు. కానీ గోపీచంద్ కి మాస్ లో ఉన్న గుర్తింపు కారణంగా కొంతవరకు నష్టాలు తగ్గే అవకాశముంది. దీనిని బట్టి చూస్తే.. గోపీచంద్ సినిమాలపై ప్రేక్షకుల ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. సరైన కంటెంట్ తో వస్తే గోపీచంద్ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తాడు అనడంలో సందేహం లేదు.