English | Telugu

మైత్రి మూవీ మేకర్స్‌తో మైండ్ గేమ్‌లో దిల్ రాజుదే పైచేయి!


'మైత్రి మూవీ మేకర్స్ వారితో దిల్ రాజు కోల్డ్ వార్ మొదలుపెట్టారు' అని మీడియా సర్కిల్స్ లో కూడా చాలా ప్రచారం జరుగుతోంది.ఈ సంక్రాంతి సినిమా ధియేటర్ల ఆట ఎంతవరకు సాగుతుందో ఎవ్వ‌రికీ అర్థం కావడం లేదు. ఏ స్టార్ హీరో అయినా తన సినిమా దిల్‌ రాజు పంపిణీ చేయాలని, లేదంటే దిల్ రాజు నిర్మాణంలో నటించాలని భావిస్తారు. ఈ విధంగా సంక్రాంతిలో స్క్రీన్ గేమును దిల్ రాజు ఆడుతున్నారు.. అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

చిరంజీవి, బాలకృష్ణల సినిమాల విషయంలో కూడా దిల్ రాజు ప్ర‌వ‌ర్తిస్తున్న తీరుకు ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు. వాస్తవానికి పండగ సీజన్లలో తెలుగు సినిమాలకు కేటాయించిన తర్వాతే మిగిలిన డబ్బింగ్ సినిమాలకు థియేటర్లో కేటాయించాలని ఒకనాడు తీర్మానం జరిగింది.అది కూడా దిల్‌ రాజు ఉండగానే. దిల్ రాజు ఆ మాటలను తప్పుతున్నాడు. త‌న 'వార‌సుడు' చిత్రాన్ని ఆయ‌న వాయిదా వేశారు. కాస్త ఆయ‌న మెత్త‌ప‌డ్డారు అని అంద‌రు భావిస్తున్నారు. కానీ ఆయ‌న కేవ‌లం తాను అనుకున్న డేట్ కంటే కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే 'వార‌సుడు'ని పోస్ట్ పోన్ చేశారు.ఆ మాత్రాన ఆయ‌న పూర్తిగా వెన‌క్కి త‌గ్గాడ‌ని భావించ‌డానికి వీలు కాదు. ఆయ‌న ఇప్ప‌టికీ జ‌న‌వ‌రి 14న 'వార‌సుడు'తో వ‌స్తున్నాడు. అంటే సంక్రాంతి రోజునే ఆయ‌న టార్గెట్ చేస్తున్నారు. దీనివ‌ల్ల చిరు, బాల‌య్య చిత్రాల‌కు థియేట‌ర్ల విషయంలో ఒకటి రెండు రోజులు మాత్ర‌మే థియేట‌ర్ల ప‌రంగా ప్ల‌స్ అవుతుంది.

ఇక దిల్‌ రాజు కూడా త‌న పంతానికి త‌గ్గ‌ట్లు 'వార‌సుడు'ను తాను అనుకున్న‌న్ని థియేట‌ర్ల‌తో వ‌స్తారు. కాబ‌ట్టి దీని వ‌ల‌న ఒరిగేదేమీ ఉండ‌దు. దానికి బ‌దులుగా ఆయ‌న 11వ తేదీనే అజిత్ 'తెగింపు'తో రావ‌డం ఇక్క‌డ దిల్ రాజు ఎత్తుగ‌డ‌ను తెలియ‌జేస్తోంది. ఇక వైజాగ్ లో 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' సినిమాల కంటే డబుల్ థియేటర్లను 'వారసుడు' సినిమాకు ఆయన కేటాయించారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ "నా సినిమాలు కాదని వేరే సినిమాలకు నా థియేటర్లను కేటాయించేంతమంచి మనసు నాకు లేదు. నా సినిమాల తరువాతే ఇతర సినిమాల గురించి ఆలోచిస్తాను" అన్నారు.

'వారసుడు' సినిమాను సాధ్యమైనంత ఎక్కువ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఆయ‌న నాడు చెప్పకనే చెప్పారు. 'వారసుడు' సినిమా వరకు అయితే పర్వాలేదు కానీ ఆయన ఇప్పుడు అజిత్ నటించిన 'తునివు' తెలుగుడబ్బింగ్వెర్షన్ 'తెగింపు' రైట్స్ ని కూడా కొనుగోలు చేయ‌డం ఆయ‌న స్ట్రాట‌జీనితెలియజేస్తోంది.ఆ సినిమాను కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేస్తున్నాడు. అదే జరిగితే 'వారసుడు', 'తెగింపు' సినిమాలతో పోలిస్తే చిరు, బాలయ్య సినిమాలకు తక్కువ థియేటర్లు లభించే అవకాశం ఉంది.

కావాలంటే 14వ తేదీన 'తెగింపు', 'వార‌సుడు' చిత్రాలు ఆడుతున్న‌ థియేట‌ర్ల సంఖ్య‌తో పోల్చి 'వాల్తేరు వీర‌య్య‌', 'వీర‌సింహారెడ్డి'ల థియేట‌ర్ల‌ను లెక్కిస్తే దిల్ రాజు త‌గ్గిన‌ట్లు క‌నిపించినానిజానికి ఆయ‌నేమీ త‌గ్గ‌లేద‌నే విష‌యం అర్ధ‌మ‌వుతోంది. ప‌రిస్థితుల‌ను త‌న‌కు అనుకూలంగా ఆయ‌న మార్చుకుంటున్న తీరు, ఆయ‌న చాణ‌క్య నీతి చూసి విశ్లేష‌కులు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. తన ఆధిపత్యం కనబరిచేందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని కొందరు విమర్శిస్తున్నారు.

ముఖ్యంగా మైత్రి మూవీకి మేకర్స్ వారు సొంత డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ తెరవడం అనేది దిల్ రాజుకి నచ్చడం లేదు.అందుకే వారి సినిమాలకు థియేటర్లు కేటాయించే విషయంలో గేమ్ ఆడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో అందరూ తెగ చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి. ప్ర‌స్తుతానికి అయితే దిల్ రాజుదే పైచేయిగా క‌నిపిస్తోంది. వెండి తెరపై పోటీ కన్నా ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారని పోటీ మీదనే అందరి ఆసక్తి నెలకొని ఉంది.మైత్రి వారిపైన మాన‌సికంగా దిల్ రాజు త‌న మైండ్ గేమ్ తో విజయం సాధించార‌నేది లోతుగా ఆలోచిస్తే అర్థమ‌వుతుంది.