English | Telugu
బాలయ్య లాంటోళ్ళు ప్రపంచంలో మరొకరు లేరు.. ఏం చూసుకొని పొగరో తెలుసా!
Updated : May 4, 2025
నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ(Balakrishna)పేరు వింటే చాలు తెలుగు సినిమా ప్రేక్షకులు ఆనందంతో పులకరించిపోతారు. ఐదు దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర సీమలో తిరుగులేని కధానాయకుడిగా కొనసాగుతు, తనకి మాత్రమే సాధ్యమయ్యే పాత్రలతో అభిమానులని,ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నాడు. వారసత్వానికి స్టార్ డమ్ తెచ్చిన మొట్టమొదటి హీరో బాలయ్య అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజకీయాల్లోను ప్రవేశించి హిందూపురం సెగ్మెంట్ నుంచి హ్యాట్రిక్ ఎంఎల్ఏ గా రికార్డు సృష్టించి, ప్రజాసేవలో తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నాడు.
ఇటీవల కేంద్రప్రభుత్వం నుంచి దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారమైన 'పద్మభూషణ్'(Padma Bhushan)ని బాలకృష్ణ అందుకున్న విషయం తెలిసిందే. కళారంగానికి సంబంధించి అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హిందూపురం(Hindupur)నియోజకవర్గ ప్రజలు బాలయ్య ని ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం బాలయ్య మాట్లాడుతు హిందూపురం ప్రజలు తమ సొంత డబ్బుతో ఈ సన్మానం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి యాభై ఏళ్ళు పూర్తవుతుంది. పైగా వరుసగా నాలుగు చిత్రాలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా పద్మభూషణ్ రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించాలన్నా,చరిత్ర తిరగరాయాలన్నా నేనే. యాభై ఏళ్ళ నుంచి హీరోగా కొనసాగుతున్న మరో వ్యక్తి లేడు. నాకు అంతటి శక్తిని ఇచ్చిన తెలుగు జాతికి నా కృతజ్నతలు. ఏం చూసుకొని బాలయ్యకి పొగరని కొంతమంది అంటారు. నన్ను చూసుకునే నాకు పొగరని అభిమానులని ఉద్దేశించి చెప్పాడు.
సినిమాల విషయానికి వస్తే బాలయ్య ప్రస్తుతం అఖండ 2(Akhanda 2)చేస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీకి బోయపాటి శ్రీను(Boyapati Srinu)దర్శకుడు. సింహా, లెజండ్, అఖండ కాంబో కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో అఖండ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. విజయదశమి(VIjayadasami)కానుకగా సెప్టెంబర్ 25 న ఈ చిత్రం విడుదల కానుంది. వీరసింహారెడ్డి ఫేమ్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni)తో తన నెక్స్ట్ మూవీకి బాలయ్య కమిట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.
