English | Telugu
నాగ్, శ్రీదేవి `ఆఖరి పోరాటం`కి 34 ఏళ్ళు!
Updated : Mar 12, 2022
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రచించిన పలు నవలలు.. తెలుగునాట అవే పేర్లతో వెండితెర రూపం దాల్చాయి. వాటిలో `ఆఖరి పోరాటం` ఒకటి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాలో కింగ్ నాగార్జున, అతిలోక సుందరి శ్రీదేవి జంటగా నటించారు. సుహాసిని మరో నాయికగా దర్శనమిచ్చిన ఈ సినిమాలో అమ్రిష్ పురి, చంద్రమోహన్, సత్యనారాయణ, జగ్గయ్య, నూతన్ ప్రసాద్, ప్రదీప్ శక్తి, సుత్తి వేలు, పీజే శర్మ, జయంతి, నిర్మలమ్మ, మమత, పేకేటి శివరామ్, మాస్టర్ రాజేశ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. జంధ్యాల సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రానికి కె.ఎస్. ప్రకాశ్ ఛాయాగ్రహణం అందించారు. ఆధ్యాత్మిక ముసుగులో అక్రమాలు చేసే ఆత్మానంద స్వామి అనే ఓ దుర్మార్గుడిని.. స్టేజ్ ఆర్టిస్ట్ విహారి సహాయంతో సీబీఐ ఆఫీసర్ ప్రవల్లిక ఎలా తుదముట్టించింది? అనేదే `ఆఖరి పోరాటం` చిత్రం. యాక్షన్, రొమాన్స్, కామెడీ అంశాలను మేళవించి ఆద్యంతం ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు రాఘవేంద్రరావు.
Also Read:పవన్ కళ్యాణ్ తోనూ కొనసాగేనా!
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతసారథ్యంలో రూపొందిన గీతాలన్ని విశేషాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. దివంగత దిగ్గజ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం, లతా మంగేష్కర్ కలిసి పాడిన ``తెల్లచీరకు`` అంటూ సాగే పాట ఎవర్ గ్రీన్ మెలోడీగా నిలిచింది. అలాగే ``స్వాతి చినుకు``, ``గుండెల్లో తకిట``, ``అబ్బ దీని సోకు``, ``ఎప్పుడు ఎప్పుడు`` పాటలు కూడా రంజింపజేశాయి. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన `ఆఖరిపోరాటం`.. 1988 మార్చి 12న విడుదలై మంచి విజయం సాధించింది. నేటితో ఈ జనరంజక చిత్రం 34 వసంతాలు పూర్తిచేసుకుంది.