English | Telugu
శ్రీకాంత్ `ఆపరేషన్ దుర్యోధన`కి 15 ఏళ్ళు!
Updated : May 31, 2022
సీనియర్ కథానాయకుడు శ్రీకాంత్ లోని నటుడ్ని కొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రాల్లో `ఆపరేషన్ దుర్యోధన` ఒకటి. మల్టిటాలెంటెడ్ పోసాని కృష్ణమురళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీకాంత్ నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో మెస్మరైజ్ చేశారు. తన సిన్సియారిటీ కారణంగా కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్న రాజకీయ నాయకులపై, వ్యవస్థపై మహేశ్ అనే నిజాయితీ పరుడైన పోలీస్ అధికారి చేసిన పోరాటమే `ఆపరేషన్ దుర్యోధన` చిత్రం. ఇందులో శ్రీకాంత్ కి జంటగా కళ్యాణి నటించగా ముమైత్ ఖాన్, కృష్ణభగవాన్, బ్రహ్మానందం, చలపతి రావు, వేణు మాధవ్, నర్రా వెంకటేశ్వరరావు, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెస్ నారాయణ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. గెహనా వశిష్ఠ్ ఓ ప్రత్యేక గీతంలో చిందులేసింది.
ఎం. ఎం. శ్రీలేఖ సంగీతమందించిన `ఆపరేషన్ దుర్యోధన`.. తమిళంలో `తీ` (సుందర్.సి, నమిత, రమ్యరాజ్) పేరుతో రీమేక్ అయింది. అమన్ ఇంటర్నేషనల్ మూవీస్ పతాకంపై పోసాని కృష్ణమురళి, ఎ. మల్లికార్జున రావు నిర్మించిన `ఆపరేషన్ దుర్యోధన`.. 2007 మే 31న విడుదలై ప్రజాదరణ పొందింది. నేటితో ఈ చిత్రం 15 వసంతాలు పూర్తిచేసుకుంది.