English | Telugu

'అన్ స్టాపబుల్' అంటున్న 'బిగ్ బాస్' సన్నీ

ఓటీటీ వేదిక ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్ స్టాపబుల్' షో ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ షో సీజన్-2 కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూసున్నారు. అయితే ఇప్పుడిదే టైటిల్ తో 'బిగ్ బాస్' ఫేమ్ సన్నీ ఓ సినిమాని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

బిగ్ బాస్ తో సన్నీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్న సన్నీ.. తాజాగా మరో సినిమాకి సిగ్నల్ ఇచ్చాడు. ఏ2బీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'సన్ ఆఫ్ ఇండియా' ఫేమ్ డైమండ్ రత్నబాబు దర్శకుడు. పూజా కార్యక్రమాలతో ఈరోజు ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు టైటిల్ తో కూడిన పోస్టర్ ని కూడా విడుదల చేశారు. అందులో సన్నీ సూట్ వేసుకొని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అలాగే పోస్టర్ పైన "No Doubt.. 100% Entertainment" అని రాసుంది.

రైటర్ గా ఎన్నో సినిమాకు పనిచేసిన డైమండ్ రత్నబాబు 'బుర్రకథ' సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పరాజయం పాలైనప్పటికీ రెండో సినిమాగా మోహన్ బాబుతో 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సినిమా రత్నబాబుకి విజయాన్ని అందించకపోగా.. ట్రోల్స్ కి గురైంది. దర్శకుడిగా మొదటి విజయం కోసం ఎదురుచూస్తున్న రత్నబాబు 'అన్ స్టాపబుల్'తో హిట్ అందుకుంటాడేమో చూడాలి.

భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వేణు మురళీధర్, ఎడిటర్ గా గౌతమ్ రాజు వర్క్ చేస్తున్నారు.