English | Telugu

'ఫైవ్ స్టార్ ప్రచారక్' రామ్ మాధవ్ చుట్టూ తిరుగుతున్న ఏపీ బీజేపీ రాజకీయం

* జమ్మూ కాశ్మీర్ అసైన్మెంట్ తర్వాత, ఏపీ మీద దృష్టి పెట్టిన అమలాపురం బుల్లోడు
* 2024 ఎన్నికలకు ఏపీ బీ జె పీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ కావాలని లక్ష్యం
* కన్నా, సుజనా లను విజయసాయి చేత టార్గెట్ చేయిస్తోంది కూడా రామ్ మాధవే నని గుసగుసలు
* నిజంగా ఆర్ ఎస్ ఎస్ నాగపూర్ హెడ్ క్వార్ట్రర్స్ ఇన్వాల్వ్ అయితే, సుజనా, పురంధేశ్వరి ల పాత్ర పరిమితమయ్యే అవకాశం

ఆంధ్ర ప్రదేశ్ లో పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీరుస్తోంది. ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు పిట్టలయితే, వారి పోరు తీర్చే పిల్లి విజయసాయి రెడ్డి అన్న మాట. వారం రోజులుగా ఏపీ లో ఉద్ధృతమైన రాజకీయ పార్టీల మాటల తూటాలకు కేంద్ర బిందువు సోము వీర్రాజేనని కమలదళాలు గుసగుస లాడుకుంటున్నాయి. ఇప్పుడు కంక్లూషన్ ఏమిటంటే, బీ జె పీ లో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలన్నీ, సోము వీర్రాజే , విజయసాయి రెడ్డి కి చేరవేస్తున్నారనీ, ఆ తర్వాతనే, విజయసాయి రెడ్డి- కన్నా, సుజనాల మీద మాటల దాడి మొదలెట్టారనిన్నీ! అసలు ఇదంతా ఎవరి డైరెక్షన్ లో జరుగుతోంది, ఏమి ఆశించి వారు ఇదంతా చేస్తున్నారని ఆరా తీస్తే, చాలా ఆసక్తికర విషయాలే వెలుగులోకి వస్తున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ బీ జె పీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నేతృత్వం లో, పార్టీ రాజ్య సభ సభ్యుడు జీ వీ ఎల్ నరసింహా రావు మార్గదర్శనంలోనే ఈ డ్రామా అంతా జరుగుతోందని, ఆ నిమిత్తమే, కన్నాకు సుజనాకు దగ్గుబాటి పురంధేశ్వరికి ఎసరు పెట్టడానికి, విశాఖ మాధవ్ ని ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ నూతన అధ్యక్షుడుగా చెయ్యడానికే బీజేపీ తన హిజ్ మాస్టర్ వాయిస్ అయిన వై ఎస్ ఆర్ సి పీ ద్వారా లీకులు ఇప్పిస్తోందని ఢిల్లీ వర్గాల భోగట్టా. వాస్తవానికి మోడీ అవకాశమిస్తే, ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీని పునరుజ్జీవంపచేయటానికి సుజనా చౌదరి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు. అప్పుడు, రామ్ మాధవ్ , జీ వీ ఎల్ నరసింహారావు ఆయన్ను సాదరంగా ఆహ్వానించి, ముందుకు తీసుకెళ్లారు కూడా. కానీ, బీ జె పీ హెడ్ క్వార్ట్రర్స్ కు సుజనా చౌదరి దగ్గర కావటం ఇష్టం లేని, విజయసాయి రెడ్డి, తమకు అనుకూలంగా ఉండే వీర్రాజు -బీ జె పీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే బావుంటుందనే ఉద్దేశంతో- కథను బైపాస్ రోడ్డెక్కేంచారనీ, అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు లోకి మళ్లించి, కన్నా లక్ష్మీనారాయణ సీటుకు ఎసరు తీసుకొచ్చారనీ కూడా ప్రచారం జరుగుతోంది. అయితే వీర్రాజు, లేకపోతె మాధవ్ ---వీరిద్దరిలో ఎవరో ఒకరు బీ జె పీ ఏపీ శాఖ అధ్యక్షులైతే, వై ఎస్ ఆర్ సి పీ కి పెద్దగా రాష్ట్రం లో ఇబ్బంది ఉండదనే భావనలో జగన్ టీమ్ ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర బీ జె పీ అధ్యక్షునిగా సుజనా చౌదరి అయినా, పురంధేశ్వరి అయినా--వారు ఎక్కడ బీ జె పీ కేంద్ర నాయకత్వానికి దగ్గర అయిపోతారనే ఉద్దేశంతోనే, విజయసాయి రెడ్డి -సుజనా మీదా, కన్నా మీదా ఆరోపణల దాడిని ఉద్ధృతం చేశారనీ బీ జె పీ హెడ్ క్వార్ట్రర్స్ లో ఒక విశ్లేషణ నడుస్తోంది. పలికెడివాడు విజయసాయిరెడ్డి అట ! పలికించెడివాళ్ళు రాంమాధవ్, జీవీఎల్ అట !! అంటూ ఒక పొలిటికల్ సెటైర్ కూడా పార్టీ ఏపీ అఫైర్స్ మీద, జాతీయ స్థాయి లో హల్ చల్ చేస్తోంది.

ఏతా, వాతా రామ్ మాధవ్ స్కెచ్ లో భాగంగానే, ఆయన ట్యూన్స్ కు అనుగుణంగానే -విజయసాయి రెడ్డి ఈ రచ్చకు తెర తీశారని, అన్నీ అనుకూలిస్తే-రామ్ మాధవ్ 2024 లో రాష్ట్రం నుంచి బీ జె పీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకోవటానికి కావలసిన వాతావరణాన్ని ఇప్పటి నుంచే తయారు చేసుకుంటున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ గేమ్ లో వీర్రాజు కానీ, మాధవ్ కానీ ఆటలో అరటిపండ్లేనని, పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని తన గుప్పిటలోకి తెచ్చుకున్న తర్వాత రామ్ మాధవ్ డిఫరెంట్ గేమ్ తో ముందుకెళ్తారని పార్టీ వర్గాలు బాహాటంగానే చర్చించుకుంటున్నాయి. ఫైవ్ స్టార్ ప్రచారక్ గా ఆర్ ఎస్ ఎస్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రామ్ మాధవ్, తోలి నుంచీ సంఘ్ తో తనకున్న విస్తృతమైన అనుబంధం దృష్ట్యా సంఘ్ పెద్దలను ఒప్పించే క్రమంలో రామ్ మాధవ్ పావులు కదపటం మొదలెట్టారని నాగపూర్ సమాచారం. ఆ లెక్కన చూస్తే, సుజనాచౌదరికి గానీ, పురంధేశ్వరి కి గానీ ఆర్ ఎస్ ఎస్ తో అనుబంధం లేకపోవటం ఒక విధంగా డ్రా బ్యాక్ కిందకే వస్తుంది. రామ్ మాధవ్ మొదలెట్టిన క్రీడలో ఇప్పుడు తోలి అంకమే పూర్తి అయ్యింది, క్లైమాక్స్ లో కానీ-అంటే, 2023 చివరకు గానీ ఆయన అసలు రాజకీయం రాష్ట్ర బీ జె పీ లో మొదలు కాదనేది మరొక వర్గం విశ్లేషణ.