English | Telugu

అంబటి.. అహంకారమా? అవివేకమా?

వైసీపీలో నోరున్న నాయకులలో ఒకరిగా మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు గుర్తింపు పొందారు. అందులో సందేహం లేదు. అయితే ఇటీవలి కాలంలో ఆయన మాటల వల్ల పార్టీకి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోందన్న భావన వైసీపీ నాయకులు, శ్రేణులలోనే వ్యక్తం అవుతోంది. అసలాయన మాటలు చూస్తుంటే అహంకారం తలకెక్కిందా? లేక అజ్ణానమా అంటూ రాజకీయ పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఆయన 2029 ఎన్నికలలో వైసీపీదే అధికారం అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. వాస్తవానికి 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలేమిటన్న విషయంపై పార్టీలో ఇప్పటి వరకూ ఆత్మ విమర్శ జరగలేదు. 2019 ఎన్నికలలో 151 స్థానాలతో ఘన విజయం సాధించిన వైసీపీ 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు పరిమితం కావడానికి కారణాలేమిటన్నది వైసీపీ అగ్రనేతలకు ఇంకా అర్థమైనట్లు కనిపించదు. ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పట్టి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం చూస్తుంటే ఆ పార్టీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించదు.

వాస్తవానికి ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా నిత్యం జనంలో తిరిగినందుకే జగన్ 2019 ఎన్నికలలో అధికారంలోకి రాగలిగారు. సరే పాదయాత్ర సందర్భంగా నవరత్నాలు సహా అడుగుకో హామీ గుప్పించి జనాన్ని మాయ చేశారు అదీ ఓ కారణమేననుకోండి, వాటికి తోడు వైఎస్ వివేకాహత్య, కోడికత్తి దాడి సంఘటనలను తనకు అనుకూలంగా జగన్ సానుభూతిగా మలచుకోవడం మరో ప్రధాన కారణం. అయితే ఒక సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జనానికి ముఖం చాటేశారు. ఎప్పుడైనా బటన్ నొక్కుడు కార్యక్రమాల కోసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చినా రోడ్డుకిరువైపులా పరదాలు కట్టుకుని జనాన్ని చూడటం తనకు ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరించారు.

ఇక పోతే ఐదేళ్ల జగన్ హయాంలో అభివృద్ధి పడకేసింది. రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు. మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాల మాటే వినిపించలేదు. ఆ ఐదేళ్ల కాలంలో జరిగిందంతా.. దోపిడీ, దుర్మార్గం, అణచివేత, కక్షసాధింపు మాత్రమే. ఆ ఐదేళ్ల జగన్ పాలన మొత్తం ప్రత్యర్థి పార్టీల నేతలపై కక్ష సాధింపులతోనే గడిచిపోయింది. అందుకే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ప్రబలింది. దాని ఫలితమే 2024 ఎన్నికల ఫలితాలు. ఆ విషయాన్ని అంగీకరించడం పక్కన పెడితే కనీసం అర్ధం చేసుకోవడానికి కూడా జగన్, ఆయన పార్టీ నేతలూ సుముఖంగా లేరు.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. నెటిజనులైతే ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు, ఆయన కేబినెట్ సహచరులు నిత్యం జనంలో ఉంటున్నారు. సంక్షేమంతో పాటు, అభివృద్ధీ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ తాడేపల్లి, బెంగళూరుల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు. అటువంటప్పుడు జనం జగన్ పాలనను ఎందుకు కోరుకుంటారు? అని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.

అదలా ఉంచితే రాజకీయ విశ్లేషకులు మాత్రం అంబటి వంటి నాయకులు ప్రజల తీర్పును అవహేళన చేసే విధంగా ఇలాగే తమ వాచాలతను ప్రదర్శిస్తూ పొతే.. వైసీపీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయమంటున్నారు. స్వోత్కర్ష, పరనింద మాని వాస్తవాన్ని అంగీకరించి, తమ పాలనలో జరిగిన తప్పు లను అంగీకరించి జనంలోకి రాకుండా ఇదే విధానం కొనసాగిస్తే వైసీపీ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోవడం తధ్యమని విశ్లేషిస్తున్నారు.