English | Telugu

లోకేష్ విషెస్ కు జగన్ నో రిప్లై.. కారణమేంటో తెలుసా?

తెలుగు రాష్ట్రాలలో ప్రత్యర్థులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపే సత్సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినది నారా చంద్రబాబునాయుడే అని చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు.. ఈ సంప్రదాయానికి తెరలేపారు. అప్పటి నుంచీ అది కొనసాగుతూ వస్తోంది. ఆ క్రమంలోనే నారా చంద్రబాబు జగన్ కు ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడూ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ , ఇప్పుడు పార్టీ అధినేతగా, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ కూడా ఏటా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు. దీంతో జగన్ కు కూడా అనివార్యంగా ఈ సంప్రదాయాన్ని పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఆ క్రమంలోనే ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు. దీనిపై జగన్ ను నెటిజనులు ట్రోల్ చేయడంతో వైసీపీయులు జగన్ లోకేష్ కు రిప్లై ఇవ్వకపోవడంపై వివరణ ఇచ్చారు. లోకేష్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుసుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటూ గారు అనే మర్యాద వాచకం లేకుండా ట్వీట్ చేశారనీ, అందుకే జగన్ ఆయనకు ధన్యవాదాలు చెప్పలేదని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

దీనిపై తెలుగుదేశం వర్గీయులు లోకేష్ జగన్ ను గారూ అనకపోవడానికి కారణం ఉందంటూ రిటార్డ్ ఇచ్చారు. గత ఏప్రిల్ లో ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా జగన్ ఆయనను విష్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని మాత్రమే పేర్కొన్నారని గుర్తు చేశారు. తన తండ్రి సమకాలీనుడైన వ్యక్తికి గౌరవం ఇవ్వాలని తెలియని జగన్ ఇప్పుడు తనకు గౌరవం ఇవ్వలేదని లోకేష్ ను ఎలా అనగలరని పేర్కొన్నారు. అందుకే టిట్ ఫర్ టాట్ లా లోకేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాత్రమే సంబోధిస్తూ జన్మదిన శుభాకంక్షలు చెప్పారంటున్నారు.