English | Telugu

ఉనికి కాపాడుకోవడానికే కేసీఆర్ ఉడత ఊపులు!

రాష్ట్ర ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో కొనసాగి అహంకారంతో కన్నూమిన్నూగానక వ్యవహరించిన బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిందా? గతంలో మాట్లాడితే తోలు తీస్తామంటూ హెచ్చరికలు జారీ చేసిన ఆ పార్టీ నేతలకు ఇప్పుడు కండలు కరిగి తోలు మాత్రమే మిగిలిందా? అంటే.. తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు ఔననే అంటున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పట్టు కోల్పోయిందనీ, దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ పార్టీ నేతలు అయోమయంలో పడ్డారనీ, అందుకే రేవంత్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గాంధీ భవన్ లో సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. కేసీఆర్ చేసిన తోలు తీస్తా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ కేడర్‌లో మిగిలి ఉన్న కొద్దిపాటి తోలు ను రక్షించుకునేందుకే కేసీఆర్ ఇలాంటి పదాలు వాడుతున్నారని ఎద్దేవా చేశారు. జనం బీఆర్ఎస్ పాలనను తిరస్కరించారని, ఇప్పుడు ఉనికిని కాపాడుకోవడానికి కేసీఆర్ బయటకు రాక తప్పని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషించారు. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే ఇప్పుడు ఉడత ఊపుల మాదిరి విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పతనానికి నిలువెత్తు నిదర్శనంగా జూపల్లి అభివర్ణించారు. బీఆర్ఎస్, బీజేపీ లు లోపాయికారీ ఒప్పందంతో కలిసి పోటీ చేసినా కూడా మూడింట్ ఒక వంతు సీట్లు కూడా గెలుచుకోలేకపోయాయన్న జూపల్లి, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారనడాని కి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు.

పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం కావడం వల్లే కేసీఆర్ ఇప్పుడు జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారన్నారు. ఒకప్పుడు ఫామ్ హౌస్‌కే పరిమితమైన నాయకులు, ఇప్పుడు రోడ్ల మీదకు వస్తున్నారంటే అర్ధమ దేనన్నారు. ఉనికి కాపాడుకోవడానికే కేసీఆర్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని జూపల్లి విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేసింది కేసీఆరేనన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా ప్రాజెక్టులను పూర్తి చేయలేని దద్దమ్మ సర్కార్ కేసీఆర్ ది అంటూ విమర్శలు గుప్పించారు.