English | Telugu
చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో భారీ అవినీతి...
Updated : Oct 22, 2019
టిడిపి అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో భారీ అవకతవకలు జరిగినట్లు సమాచారం. ఉప కాలువ పనుల్లో కోట్లాది రూపాయల ప్రజా ధనం పక్కదారి పట్టిందని విజిలెన్స్ అధికారులు తేల్చారు. నియోజక వర్గ ప్రజలకు తాగు, సాగు నీరు అందించేందుకు కృష్ణా జలాలను తరలించేందుకు చేపట్టిన ఉపకాలువ తవ్వకాల్లో భారీ అవినీతి జరిగిందని విజిలెన్స్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. సుమారు నాలుగు వందల ముప్పై కోట్ల పనులకు గాను నలభై నాలుగు కోట్లు అదనంగా చెల్లించడం పై ఆగస్టు పదమూడున ప్రభుత్వం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించింది.
విజిలెన్స్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ రాజేంద్రనాథరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలువ పనులకు సంబంధించిన వివరాల్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు టిడిపి హయాంలో ప్రజా ధనాన్ని ఇష్టారాజ్యంగా దోచుకున్నారని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈపీసీ ద్వారా నాలుగు శాతం నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల పనులకు గాను నూట ఇరవై మూడు కిలోమీటర్ల కాలువ తవ్వకం, మూడు వందల ఇరవై నాలుగు చోట్ల స్ట్రక్చర్స్, ఐదు చోట్ల నేషనల్ హైవే క్రాసింగ్ ఏర్పాట్లు, మూడు చోట్ల ఎత్తిపోతల పథకాల పనులు పూర్తి చేయాల్సి ఉంది.
వాటితో పాటు నూట పది చెరువులు నింపేందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా చేయాల్సి ఉంది, ఇందు కోసం సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ సంస్థకు గత ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించింది. నిబంధనల మేరకు తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా అవి పూర్తి కాలేదు, గత ప్రభుత్వం అదనపు చెల్లింపుల కోసం ఆరు వందల ఇరవై ఆరు, అరవై ఎనిమిది జీఓలను రెండు విడుదల చేసింది. అయితే ఉపకాలువ తవ్వకాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు తేలడంతో జగన్ ప్రభుత్వం డీజీ రాజేంద్రనాధ్ రెడ్డి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ నియమించింది. ఇందుకు సంబంధించిన పనులకు చెల్లింపులు జరిగిన మదనపల్లి లోని ఎస్సీ కార్యాలయాన్ని కూడా డీజీ రాజేంద్రనాథ్ బృందం సభ్యులు పరిశీలించనున్నారు.