English | Telugu

అర్ధరాత్రి నుంచి పెరగనున్న టోల్ ఫీ!

ఈ అర్ధరాత్రి నుంచి కొత్త టోల్ రేట్లు అమలులోకి రానున్నాయి. లైట్ మోటార్, కమర్షియల్ వాహనాలపై రూ. 5 పెరుగుదల కాగా, బస్సు, ట్రక్కులపై రూ.10 పెంపు, 3 నుంచి 6 భారీ యాక్సిల్ వాహనాలపై రూ.15 పెరుగుదల ఉంటుంది. 7 యాక్సిల్స్ దాటిన వాహనాలపై రూ.20 పెంపు . టోల్ ఫీజు బాదుడు మళ్లీ మొదలుకానుంది. కరోనా లాక్‌డౌన్ వల్ల గత నెల 25 నుంచి టోల్ ఫీజును రద్దు చేశారు. ఈ నెల 20 నుంచి చాలా రంగాలకు లాక్ డౌన్ నుంచి సడలింపు ఇవ్వడంతో తిరిగి టోల్ ఫీజు వసూలు చేయనున్నారు. ఈమేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ)ను కోరింది. ఏప్రిల్ 20 నుంచి టోలు వసూళ్లు ప్రారంభించాలని పేర్కొంది.

దీనిపై సరుకు రవాణా వాహనదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల ఇప్పటికే నష్టపోయామని, టోల్ ఫీజును తాము భరించలేమంటున్నారు. ఫీజు నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని, తమకు ఉపశమనం కల్పించాలని అఖిల భారత మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) కోరింది. అయితే లాక్ డౌన్ వల్ల తమకూ భారీ నష్టాలు వచ్చాయంటున్న ఎన్‌హెచ్ఏఐ, రోడ్లను నిర్వహించే ప్రైవేటు కంపెనీలు వారి వినతిని పట్టించుకునే అవకాశం లేదు.