English | Telugu
ప్రభుత్వ పనితీరుకు పట్టం కట్టిన పంచాయతీ ఫలితాలు.. సీఎం రేవంత్
Updated : Dec 18, 2025
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంత్రులతో కలిసి గురువారం (డిసెంబర్ 17) మీడియాతో మాట్లాడిన ఆఈయన ఈ రెండేళ్లలో తమ ప్రభుత్వ పని తీరుకు పంచాయతీ ఎన్నికలు రిఫరెండంగా ఆయన అభివర్ణించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు. మొత్తం 12 వేల 702 పంచాయతీల్లో 7 వేల 527 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ విజయం సాధించిందనీ, అంటే 66శాతం స్ట్రైక్ రేట్ సాధించిందనీ చెప్పిన రేవంత్, బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కైపోటీ చేశాయనీ, అయినా కూడా రెండు పార్టీలూ కలిపి 33 శాతం పంచాయతీల్లోనే గెలిచాయని రేవంత్ అన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో 808 మంది కాంగ్రెస్ రెబల్స్ గెలిచారన్న రేవంత్ రెడ్డి వారిని కూడా కలుపుకుంటే కాంగ్రెస్ మొత్తం 8 వేల 335 పంచాయతీలలో జెండా పాతిందన్నారు. ఈ ఫలితాలను బట్టి చూస్తే.. ఎన్నికలు జరిగిన 94 అసెంబ్లీ సెగ్మెంట్లలో 87 సెగ్మెంట్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచిందన్నారు. అంటే 2028 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వస్తామని స్పష్టమౌతోందన్నారు. 2028 ఎన్నికలలో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.