English | Telugu
ఖాళీ అయిన తెలంగాణ క్వారంటైన్ సెంటర్లు!
Updated : Apr 14, 2020
క్వారంటైన్ చికిత్స నిమిత్తం కేటాయించిన సరోజినీదేవి కంటి ఆసుపత్రి, నేచర్ క్యూర్, చార్మినార్ లోని నిజామియా ఆసుపత్రి సెంటర్లు ఇప్పుడు ఖాళీ అయ్యాయి. రాజేంద్రనగర్ లోని సెంటర్ లో 160 మంది ఉండగా, మేడ్చల్ జిల్లాలో 152 మంది, రంగారెడ్డి జిల్లాలో 135 మంది క్వారంటైన్ లో ఉన్నారు. వీరి క్వారంటైన్ సమయం ఈ వారంలో ముగియనుంది.
ఇక ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 1089 మందిలో 603 మంది జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నారని గుర్తించిన అధికారులు, వారికి సంబంధించిన వారితో కలిపి మొత్తం 3,015 మందిని క్వారంటైన్ కు తరలించారు. మరో రెండు మూడు రోజుల్లో వీరి క్వారంటైన్ ముగియనుండగా, వీరున్న ప్రాంతాల్లో కొత్తగా ఎవరికీ వైరస్ సోకకుంటే, కమ్యూనిటీ వ్యాప్తి లేనట్టేనని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక, కరోనా చికిత్సకు ప్రధాన ఆసుపత్రిగా ఉన్న గాంధీ హాస్పిటల్ లో 295 పాజిటివ్ కేసులుండగా, ఐసొలేషన్ లో మరో 250 మంది వరకూ ఉన్నారు. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ లో 29 పాజిటివ్ కేసులు, 10 మంది ఐసొలేషన్ లో ఉన్నారు. కింగ్ కోఠి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో 12 కేసులు ఉండగా, 74 మంది ఐసొలేషన్ లో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఐసొలేషన్ లో ఉన్నవారి రక్త పరీక్షల ఫలితాలు వచ్చిన తరువాత వారిని ఇంటికి పంపించే విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు.