English | Telugu
ఆర్టీసి కార్మికుల వ్యవహారంలో కేంద్రం తల దూర్చనుందా..?
Updated : Nov 5, 2019
ఆర్టీసీ కార్మికులు ఈ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు ఉండవని సర్కార్ స్పష్టం చేసింది. ఈ నెల 7 న హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గడువు లోపు విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగంలోకి చేర్చుకోవద్దని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షకు మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఇన్ చార్జి ఎండీ సునీల్ శర్మ, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉద్యోగాలు కాపాడుకోవడమా కోల్పోవడమా అనేది కార్మికులే తేల్చుకోవాలని కేసీఆర్ స్పష్టం చేశారు. గడువు తర్వాత ఒక్క కార్మికుడ్ని కూడా చేర్చుకునే ప్రసక్తే లేదంటున్నారు కేసిఆర్.
గడువులోగా కార్మికులు చేరకుంటే మిగిలిన 5000 రూట్ల లోనూ ప్రైవేటు వాహనాలకు అనుమతులిస్తామని తేల్చి చెప్పారు. మరో 5000 ప్రైవేటు వాహనాలకు అనుమతులిస్తే రాష్ట్రంలో ఇక ఆర్టీసీ ఉండదు అని కేసీఆర్ అన్నారు. హైకోర్టులో విచారణను చూసి కార్మికులను యూనియన్లు మభ్యపెడుతున్నాయి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మె అంశంలో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చే అవకాశం లేదంటున్నారు. హై కోర్టు తీర్పు మరోలా ఉంటే ఆర్టీసీ యాజమాన్యం లేదా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ముఖ్యమత్రి పేర్కొన్నట్టుగా సమాచారం.
కేసీఆర్ స్వయంగా డెడ్ లైన్ విధించినా కార్మికులు పెద్దగా విధుల్లో చేరలేదని ఆర్టీసీ, జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించాలని కోరారు, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి అంటున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యను మానవీయ కోణంలో చూడాలని అంటున్నారు. చర్చిస్తే తాము సమ్మె విరమించటానికి సిద్ధంగా ఉన్నామని ఆశ్వద్ధామ రెడ్డి ప్రకటించారు. బేషరతుగా విధుల్లో చేరడాన్ని కార్మికులు అంగీకరించడం లేదని ఇవాళ అన్ని రాజకీయ పార్టీలతో ఆర్టీసీ జేఏసీ సమావేశం ఉంటుందని వెల్లడించారు.
గడువు లోగా విధుల్లో చేరాలనుకునే ఉద్యోగులు తాము పని చేస్తున్న డిపో మేనేజర్లకే కాక ఇంకా పలుచోట్ల జాయినింగ్ లెటర్ ఇవ్వొచ్చని ఎండీ సునీల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, డీఎస్పీ ఆఫీసులో గానీ లేఖలు ఇవ్వొచ్చన్నారు. అలాగే తాము పని చేస్తున్న డిపో మేనేజర్ కార్యాలయం, డీవీఎం, రీజనల్ మేనేజర్ కార్యాలయాలలోను జాయినింగ్ లెటర్స్ అందజేయుచున్నారు. ఇక హైదరాబాద్ లో పనిచేసే కార్మికుల బస్ భవన్ ఈడీ ఓపీ సేవలలో అందించొచ్చని సునీల్ శర్మ చెప్పారు. ఈ అవకాశాన్ని కార్మికులు వినియోగించుకోవాలని విధుల్లో చేరే కార్మికులకు అన్ని రకాల రక్షణ కల్పించనున్నట్టుగా ఆర్టీసీ ఎండీ హామీ ఇచ్చారు.
ఆర్టీసీ సమ్మె దాని స్థితిగతులపై కేంద్రం ఆరా తీస్తోందా, బిజెపి అధిష్టానం దృష్టికి ఆర్టీసీ సమ్మె వ్యవహారాన్ని తీసుకువెళ్ళి రాష్ట్ర కమలదళం కేంద్రం జోక్యాన్ని కోరుతుందా, ఒకవేళ కేంద్రం ఎంటరైతే ఏమవుతుంది ఈ ప్రశ్నలన్నిటికీ కారణం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాయబోతున్న లేఖ, కార్మికుల డిమాండ్లు ఆర్టీసీ స్థితిగతుల పై ఇప్పటికే సునిల్ శర్మ కేంద్ర రవాణా శాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ రాశారు. దానికి స్పందన లేదని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాయబోతున్నట్లు సమాచారం.