English | Telugu
పోలవరం పనులు ప్రారంభించిన 4 రోజులకే అదనపు ఖర్చు... రివర్స్ పంచ్!!
Updated : Nov 5, 2019
రివర్స్ టెండరింగ్ విజయవంతమైంది. పోలవరం సాగు నీటి ప్రాజెక్టు, జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులలో 628 కోట్ల రూపాయలు ఆదా చేశామని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది కానీ, ఇప్పుడు ఆదా కూడా రివర్సవుతోంది. కాంట్రాక్టు సంస్థ కోట్ చేసిన మొత్తానికి అదనంగా 500 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సమాయత్తమవుతోంది. ఆ సంస్థ పోలవరం సాగు నీటి ప్రాజెక్టు పనులు ప్రారంభించిన నాలుగు రోజులకే అదనపు చెల్లింపులకు సిద్ధం కావటం విశేషం. తాజా అంచనాల మేరకు ధరల సవరణ కూడా జరిగితే రీటెండర్ లో మిగులంతా కొట్టుకుపోతుందని నిపుణులంటున్నారు.
పోలవరం హెడ్ వర్క్స్ లో మిగిలిన పనులు జల విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని కలిపి ఒకటే ప్యాకేజ్ గా 4,987 కోట్లకు జల వనరుల శాఖ రివర్స్ టెండర్ ను పిలిచింది. ప్రీ బిడ్ సమావేశానికి ఆరు సంస్థలు వచ్చినా చివరకు ఒకే సంస్థ బిడ్ దాఖలు చేసింది. అంచనా వ్యయం కంటే దాదాపు 12.6 శాతం తక్కువగా.. అంటే 4,359 కోట్లతో పనులు పూర్తి చేస్తామని సంస్థ తెలిపింది. రివర్స్ టెండర్ విధానంలో బిడ్ లను పిలిచినప్పుడు కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ నిర్మాణ సంస్థలు పాల్గొనాలి. ఇక్కడ ఒకటే సంస్థ బిడ్ దాఖలు చేయటంతో దీన్ని రీటెండర్ గా జల వనరుల శాఖ గుర్తించింది. అటు జల విద్యుత్ కేంద్రం రివర్స్ టెండర్ల పైన హై కోర్టు స్టే ఎత్తివేయటంతో అదే సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
గతంలో కాంట్రాక్టు సంస్థ పనులు చేసినపుడు రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లో ఉంది. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానం ప్రకారం టన్నుకు 375 రూపాయల చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఆ మొత్తంతో పాటు జీఎస్టీ ఇతర పన్నులు, టెండర్ డాక్యుమెంట్ పరిధిలోకి రాని పనులకు ప్రభుత్వం అదనంగా చెల్లించాలని కొత్త కాంట్రాక్టు సంస్థ జలవనరుల శాఖకు తాజాగా లేఖ రాసింది. దీనిపై పోలవరం చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు సానుకూలంగా స్పందించారు. ఇసుకకు టెండరు డాక్యుమెంట్ లో లేని ఇతర పనులు చేసేందుకు అదనంగా డబ్బు చెల్లించాలని కాంట్రాక్టు సంస్థ అడగడం, అందుకు జల వనరుల శాఖ సుముఖత వ్యక్తం చేయడంపై నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టెండర్ వేసినప్పటికే రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం రద్దయ్యింది, బిడ్ వేసినప్పుడు ఇసుక ప్రస్తావన తీసుకురాకుండా ఇప్పుడు చెల్లింపులు జరపాలని కోరడం తగదని అంటున్నారు.