English | Telugu

మీరసలు హిందువులేనా, మీకసలు దేశ భక్తి ఉందా?.. విజయసాయి

వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి హిందుత్వ అనుకూల వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సన్యాసం తీసుకుని వ్యవసాయమే వ్యాపకమంటూ ప్రకటించిన ఆయన అడపాదడపా రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. అన్నిటికీ మించి ఆయన ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు ఆయన కమలం గూటికి చేరువ అవుతున్నారన్న సంకేతాలు ఇస్తున్నాయి. విజయసాయి కాషాయ మంత్రం జగన్ కు కషాయం కావడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇటీవల ఒక సందర్భంగా ఆయన హిందూమతంపై కుట్రలు జరుగుతున్నాయంటూ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు ఆశ చూపి మతమార్పిడులకు పాల్పడుతున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అక్కడితో ఆగకుండా గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై ఓ కమిటీ వేసి మరీ విచారణ జరపాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

దీంతోఆయన జగన్ అండ్ వైసీపీ టార్గెట్ గా రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ పరిశీలకులు విశ్లేషించారు. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్ లో ఆందోళనలు హింసాకాండపై ఎక్స్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి.. బంగ్లాదేశ్ లో హిందువులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నా యన్నారు. ఈ దాడులను ఆయన నరమేధంగా అభివర్ణించారు. ఈ దాడులను ఖండించని వారు అసలు హిందువులే కారనీ, వారికసలు దేశ భక్తే లేదంటూ విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అమానుష దాడులను ఖండించకుండా మౌనంగా ఉన్న రాజకీయ పార్టీలకు, నాయకులకు ఈ దేశంలో కొనసాగే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు.

భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో ఆయన తన రాజకీయ పున: ప్రవేశానికి కమలదళం గొంతుకను సిద్ధం చేసుకుంటున్నారని పరిశీలకులు అంటు న్నారు.