English | Telugu

నెగెటివ్ వచ్చినా ఆ ల‌క్ష‌ణాలుంటే మ‌ళ్ళీ మ‌ళ్ళీ ప‌రీక్ష చేయించుకోవాలి!

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఓ డాక్టర్ తాజాగా కోవిడ్-19 బారిన పడడం వైద్య నిపుణులను కూడా కలవరపెడుతోంది. 60 ఏళ్లున్న జనరల్ ప్రాక్టీషనర్ ఇండోర్ లోని త్రివేణి కాలనీలో క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఆయన కరోనాతో మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఆయనకు కొద్దిరోజుల క్రితం జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయి. అది సాధారణ ఎలర్జీగానే భావించారు. అయినప్పటికీ ఈ నెల 3, 4 తేదీల్లో కరోనా టెస్టులు కూడా నిర్వహించారు. ఆ రెండు సార్లు కూడా నెగెటివ్ తేలడంతో డాక్టర్, ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

అలర్జీ లక్షణాలతో ఆయన రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చే పేషెంట్లకు వైద్యసేవలు అందించారు. అయితే ఆయనకు కోవిడ్-19 సోకిందని తెలిసేటప్పటికే చనిపోవడం కలకలం రేపుతోంది. డాక్ట‌ర్ బ్ర‌తికి వున్న‌ప్పుడు చేసిన టెస్ట్‌లో నెగెటివ్ వ‌చ్చింది. అయితే ఆయ‌న మ‌రో సారి చేయించుకుంటే పాజిటివ్ వ‌చ్చేదేమో. చ‌నిపోయిన త‌రువాత చేసిన ప‌రీక్ష‌లు పాజిటివ్ వ‌చ్చింది.

ఆయన దగ్గరకు ట్రీట్ మెంట్ కోసం ఎంతమంది వచ్చారు? వారి కుటుంబాల్లో ఎంతమంది ఉన్నారు? వారు ఎంతమందిని అటాచ్ అయ్యారు? అసలు ఆ కాలనీలో ఎంతమంది ఉన్నారు? అనే అంశాలపై ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆరా తీస్తున్నారు. వైద్యుడు ఉంటున్న త్రివేణి కాలనీని సీజ్ చేశారు. అక్కడున్న అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.

వైద్యుడి పిల్లలు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. మొబైల్ ఫోన్ వీడియో కాల్ ద్వారా ఆయన శవాన్ని బంధువులకు అప్పగించడాన్ని ఆయన పిల్లలకు చూపించారు.