English | Telugu

గతంలో కంటే ప్రస్తుత జిడిపి వృధ్ధి రేటు మరింత తగ్గుతుందా..?

ఆర్థిక వృద్ధిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కేంద్రం ఎన్ని సంస్కరణలు తీసుకొస్తున్నా వృద్ధి రేటులో ఏమాత్రం పెరుగుదల కనిపించడం లేదు. జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలోనూ నిరాశే మిగల్చడం ఇందుకు కారణంగా మారింది. జిడిపి 5 శాతం లోపే ఉంటుందని అంచనా వేస్తుండటం కలవరానికి గురి చేస్తోంది. అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంస్కరణలు తీసుకొస్తున్నా వృద్ధి రేటు మాత్రం పెరగడం లేదు. రెండో త్రైమాసికం లోనూ జిడిపి కోలుకునే అవకాశం లేదని ఎస్.బి.ఐ నివేదించడం పరిస్థితికి అద్దం పడుతోంది. గతంతో పోలిస్తే మరింత దిగజారే అవకాశమే ఉందని చెబుతుండడం కలవరానికి గురి చేస్తోంది. ఈ సారి ఐదు శాతానికి దిగువనే వృద్ధి రేటు ఉండచ్చని ఎస్.బి.ఐ అంటోంది.

2012,2013 నాటి అంచనా స్థాయికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం త్రైమాసికం సరి సమానంగా వుండనుందని చెబుతోంది. పడిపోయన వినియోగ సామర్థ్యం, క్షీణించిన పెట్టుబడులు సేవా రంగంలో మందగమనం వంటివి జిడిపి పెరుగుదలకు బ్రేక్ వేస్తున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జిడిపి గాడిలో పడాలంటే ఇంకా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అక్టోబర్, డిసెంబర్ మధ్య కాస్త కోలుకోవచ్చని భావిస్తున్నారు. సెప్టెంబర్ లో 3.1 లక్షల కోట్లు ప్రభుత్వం ద్వారా ఖర్చు కావడం ఇందుకు దోహదపడుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో జిడిపి గాడిన పడచ్చని ఆశాభావం వ్యక్తం చేసినా మార్పు మాత్రం రాలేదు.

భారత ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని పరిశీలించిన దేశ విదేశీ ఆర్థికవేత్తలు, నిపుణులు వివిధ అధ్యయనాలు జిడిపి అంచనాలని తగ్గిస్తూ పోతున్నాయి. ఇంతకు ముందున్న 6.2 శాతాన్ని కూడా అందుకోవడం కష్టమనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. క్షీణించిన రుణ వృద్ధి రేటు తిరిగి బలపడుతుందన్న ఆశతో ఉన్నారు. సెప్టెబర్ నెలారంభం నుంచి రుణాలకు డిమాండ్ పెరిగిందని 1.08 లక్షల కోట్లకు చేరుకుందని అధికారులు వెల్లడించారు. త్వరలో ఆర్.బి.ఐ నిర్వహించబోయే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో మరోమారు వడ్డీ రేట్లను పావు శాతం తగ్గించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడేకాదు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సమీక్షలోనూ 0.15 శాతం వడ్డీ తగ్గించే ఆస్కారం ఉందని అభిప్రాయ పడుతున్నారు.