English | Telugu

70 ఏళ్ళ వయస్సులో కంకరను కరకరా నమిలేస్తున్న ఓ వృధ్ధుడు..!!

అన్నంలో చిన్న ఇసుక రవ్వ వస్తేనే విలవిల్లాడిపోతాం, నోటితో బఠానీలు నమలాలంటేనే బెంబేలెత్తిపోతుంటాం కానీ, ఓ వృద్ధుడు కంకర రాళ్లను సైతం కరకరా నమిలేస్తున్నాడు. డెబ్బై ఏళ్ళ వయస్సులోనూ రాళ్లను ఉండ్రాళ్లలా కొరికి పాడేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో ఈ స్టోన్ మ్యాన్ సంచలనంగా మారాడు. పేరు సత్తిరెడ్డి వయసు డెబ్బై ఏళ్లు సాధారణంగా ఈ వయసులో పళ్లూడిపోయే స్థితిలో ఉంటారు వృద్ధులు.

కానీ, ఈ స్టోన్ మ్యాన్ సత్తిరెడ్డి మాత్రం రోజు రోజుకూ పళ్లను బలంగా మార్చుకుంటున్నాడు. రాళ్ళను అన్నంలా నమిలి పిప్పి చేస్తున్నాడు. ఓ దశలో తన పళ్లు ఊడిపోయే స్థితికి వచ్చాయి అంటున్నాడు సత్తిరెడ్డి. ఆ సమయంలో ఏ డాక్టర్ కు చూపించుకోలేదు. కేవలం మూలికలతో తన పళ్లు బాగుపడ్డాయని చెబుతున్నాడు. పళ్లు గట్టిపడటం కోసం తానే కొత్త రకం మూలికను తయారు చేశాను అన్నాడు. అప్పట్నుంచీ పళ్లు గట్టిపడి రాళ్లు నమిలే స్థితికి వచ్చానంటున్నాడు స్టోన్ మ్యాన్ సత్తిరెడ్డి.

సత్తిరెడ్డిని చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతోందంటున్నారు గ్రామస్తులు. అన్నంలో రాళ్ళొస్తేనే విలవిల్లాడతాం అని, అలాంటిది రాళ్లనే అన్నంలా తినడం చూస్తుంటే ముచ్చటగా ఉందన్నాడు గ్రామ సర్పంచ్. తన దగ్గరున్న మూలికను సీఎం కేసీఆర్ కి కూడా ఇస్తానంటున్నాడు సత్తిరెడ్డి. గతంలో పంటి నొప్పితో కేసీఆర్ భాదపడ్డట్లు విన్నాననీ అవకాశమొస్తే ఆయన పళ్లను కూడా తన పళ్ళ లాగా మారుస్తాను అని సత్తిరెడ్డి అంటున్నాడు. అవసరమైతే పళ్ళకు సంబంధించిన యాడ్స్ లో నటించటానికి కూడా సిద్ధమని ప్రకటించాడు.