English | Telugu

మే 3 తర్వాతే లాక్‌డౌన్‌పై నిర్ణయం!

ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది. ముఖ్యమంత్రులతో లక్‌డౌన్‌పై ప్రధాని మాట్లాడుతూ మనం కలిసి చేస్తున్న ప్రయత్నాలు స‌త్‌ఫ‌లితాలు చూపిస్తున్నాయ‌న్నారు. లాక్‌డౌన్‌ వల్ల మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. వేలమంది ప్రాణాలు రక్షించగ‌లిగాం. దీనిపై నిరంతరం నిపుణుల సూచనలు తీసుకుంటున్నాం. అయితే లాక్‌డౌన్‌పై మే 3వ తేదీ తరువాత నిర్ణయం తీసుకుంటామని ప్రధాని అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌.

కరోనా వ్యాప్తి ఉన్నచోట్ల లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. కరోనా ప్రభావం తక్కువున్న రాష్ట్రాల్లో జిల్లాల వారిగా సమీక్షిస్తామని వెల్లడించారు.

లాక్‌డౌన్‌ విధించిన తర్వాత నాలుగోసారి జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్‌లో కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ అమలు, ఆంక్షలపై చర్చించారు. లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేసే అంశంపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ప్రధాని సీఎంలతో చర్చించారు.

అయితే, మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని పలు రాష్ట్రాలు కోరుతున్న వేళ ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కీలకంగా చర్చిస్తున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచాలని, ఆర్థిక సాయం అంశాలను పలు రాష్ట్రాలు ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది.

దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన చెందవద్దని సీఎంలతో మోదీ పేర్కొన్నారు.