English | Telugu

ఐటీ కంపెనీల్లో జులై వరకు ఇంటినుంచే ప‌ని!

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని ఐటీరంగ సంస్థలు జులై చివరి వారం వరకు ఇంటినుంచే పనిచేయాలస్సి ఉంటుందని హ‌ర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు అనుమతించాల్సిందిగా హర్యానా అదనపు ప్రధాన కార్యదర్శి విఎస్ కుందూ ప్రకటించారు.

డీఎల్ఎఫ్ సహా పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కొన్ని నిబంధనలతో తాము అనుమతించామని తెలిపారు. కార్మికులు తప్పనిసరిగా మాస్కులు ధరించి తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మిలినీయం సిటీగా పిలిచే గురుగ్రామ్‌లో ఇన్ఫోసిస్, జెన్‌పాక్ట్, గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ సహా అనేక బిపిఓలు, ఎంఎన్‌సిలు లాంటి అనేక దిగ్గజ కంపెనీలు ఇక్కడ కొలువుదీరాయి.

కరోనా నియంత్రణలో భాగంగా మార్చి నెలలో పలు కంపెనీలు ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా ఉద్యోగులను ఆదేశించాయి. అయితే దీన్ని జులై నెలాఖరు వరకు పొడిగించాల్సిందిగా తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. లాక్‌డౌన్ సందర్భంగా రేషన్‌లేని పేద కుటుంబాలకు మూడు నెలలపాటు ఉచితంగా రేషన్ అందిస్తామని సీఎస్ కందూ పేర్కొన్నారు.

రెండు దుస్తుల పరిశ్రమలకు పీపీఈ కిట్లను తయారుచేయడానికి అనుమతించినట్లు తెలిపారు. ప్రస్తుతం గురుగ్రామ్‌లో 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో రెడ్ జోన్‌గా ప్రకటించారు. మొత్తంగా రాష్ర్టంలో 298 కోవిడ్ కేసులు నమోదుకాగా, ముగ్గరు చనిపోయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ సంస్థలు, తెలంగాణలో ఉన్న పరిశ్రమల్లో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించవద్దని ఆయా సంస్థల యాజమాన్యాలకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.