English | Telugu

చిల్లర రాజకీయాలు ఆపకపోతే, ప్రజలు తిరగబడతారు: పవన్ కళ్యాణ్ 

ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై మన శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దామని పాలక వై ఎస్ ఆర్ సి పి కి, జన సేన చీఫ్ పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణపై కంటే రాజకీయ ప్రత్యర్థులపైనా కొందరు అధికార పార్టీ పెద్దలు దృష్టి పెడుతున్నారని, ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ ను సైతం విడిచిపెట్టలేదని, గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల ప్రజలు పెరుగుతున్న పాజిటివ్ కేసులు చూసి బెంబేలెత్తిపోతున్నారని, ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో తప్పులు వేలెత్తి చూపేవారిపై బురద చల్లే కార్యక్రమాన్ని అధికార పార్టీ పెద్దలు కొనసాగిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

" బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారిపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయి. ఆయనపై జరుగుతున్న వ్యక్తిత్వహనన దాడి ప్రజాస్వామ్యవాదులు ఖండించవలసిన రీతిలో, ఆయనకు క్షమాపణలు చెప్పాలని అడిగే స్థాయిలో ఉంది...కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయేంత వరకూ రాజకీయాలను పక్కన పెడదాం చిల్లర రాజకీయాలకు దూరంగా ఉందాం," అని పాలక వై ఎస్ ఆర్ సి పి కి పవన్ కళ్యాణ్ హితవు చెప్పారు. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై మన శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దామనీ, ఇప్పటివరకు అయినది చాలు. ఈ సమయంలోనైనా రాజకీయాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందనీ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.