English | Telugu
మా తప్పుంటే కర్నూలు రాజధాని సెంటర్ లో ఉరి తీయండి!
Updated : Apr 22, 2020
* కర్నూలు నుంచి వంద మంది మర్కజ్ కు వెళ్లిరావడాన్ని యాక్సిడెంట్ గా చూడాలని హితవు
* మీ నాయన,మీ అమ్మ ముస్లిం సమాజం ఓట్లతోనే గెలిచారంటూ భూమా అఖిలప్రియకు చురక
* పుష్కర ఘాట్లకు కోట్లు ఖర్చు పెట్టారు, ఇప్పుడు అక్కడ మెట్లయినా ఉన్నయా అంటూ ప్రశ్న
పాలక వై ఎస్ ఆర్ సి పి ఎం ఎల్ ఏ హఫీజ్ ఖాన్ డిఫెన్స్ లో పడ్డారు. కర్నూలు లో పేట్రేగిపోతున్న కరోనా వైరస్ కు ఆయన వైఖరే కారణమంటూ ప్రధాన మీడియా వేలెత్తి చూపటంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో వివరణ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. తన వల్లనో,కర్నూలు ఎంపి వల్లనో కరోనా వ్యాప్తి జరిగిందని చెబుతున్నారని, దాన్ని నిరూపించాలని, తనపైన గాని, అధికారుల పై గాని ఎంక్వైరీ వేయాలని కర్నూల్ ఎం ఎల్ ఏ హఫీజ్ ఖాన్ సవాల్ చేశారు. " నాపైనగాని...అధికారులపైనగాని ఎంక్వయిరీ వేస్తారా వేయండి....మేం తప్పు చేసిఉంటే మా కర్నూలులో రాజధాని సెంటర్ అని ఉంది...మా తప్పుఉంటే అక్కడ ఉరితీయండి...మేం రెడీ," అంటూ విపక్ష తెలుగు దేశం పై హఫీజ్ ఖాన్ విరుచుకు పడ్డారు. " కరోనాను నియంత్రించేందుకు అందరికంటే ముందున్నాను....మసీదులను బంద్ చేయించాను...తబ్లీక్ జమాత్ వారు ఎవరైతే వెళ్లి వచ్చారో..... వారి ఇంటింటికి వెళ్లి...మసీదు పెద్దలకు చెప్పి 24 గంటల్లోపల వారందర్ని క్వారంటైన్ సెంటర్ కు పంపించింది నేను....ప్రజలలో అవగాహన పెంచింది నేను.
ఈరోజు కర్నూలు కష్టసమయంలో ఉంది....ఎందుకంటే మా కర్నూలు నియోజకవర్గం నుంచి(జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతం) వందమందికి పైగా ఢిల్లీ వెళ్లి వచ్చారు.దానిని ఒక యాక్సిడెంట్ గా చూడాలి.ఈ విపత్తునుంచి ఎలా బయటపడాలా అని సలహాలు,సూచనలు ఇవ్వాలి.ఆత్మస్ధైర్యం ఇవ్వాలి.మంచి మాట చెప్పాలి.వాళ్లు ఎంతో మనస్ధాపం చెంది మానసికంగా బాధపడుతుంటే ముస్లిం సమాజాన్ని రాజకీయంగా వాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయడం చాలా బాధాకరం, " అంటూ అయన టీ డీ పీ ని విమర్శించారు.
"భూమా అఖిలప్రియగారు....మీనాయన,మీ అమ్మ ముస్లిం సమాజం ఓట్లతోనే గెలిచారనేది గుర్తుపెట్టుకోవాలి.ఇది మా సమాజానికి అంటగట్టద్దు.చేతులు మొక్కి చెబుతున్నాను.రాజకీయాలు,కులాలు,మతాలకు ముడిపెట్టద్దు. భారతదేశం బాగుండాలంటే కులాలు,మతాల గురించి మాట్లాడకూడదు.నీవు వందకోట్లు కాదు,వేయికోట్లు సంపాదించుకున్నా కూడా కరోనా వైరస్ ను మాత్రం నీవు తప్పించుకోలేని పరిస్ధితి.ఇలాంటి కష్టసమయంలో మానవత్వంతో ఆలోచించాలి.భగవద్గీత,ఖురాన్,బైబిల్ ఏం చెబుతున్నాయి అంటే మానవసేవే మాధవసేవ అని చెబుతున్నాయి.ఏమైనా చేస్తే మేలు చేయి కాని కీడు చేయవద్దని చెబుతున్నాయి.
కన్నాలక్ష్మీనారాయణగారిని సూటిగా అడుగుతున్నాను...మీ కేంద్రప్రభుత్వం కన్నా 65 రూపాయలతక్కువకు మేం కిట్లు కొన్నాం.మరి మీకు దమ్ము,ధైర్యం ఉంటే కేంద్రంలోని మీ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించండి.ఎందుకు 65 రూపాయలు ఎక్కువపెట్టి కొన్నారు అని.మేం 65 రూపాయల తక్కువకు కొనడమే కాదు.అగ్రిమెంట్ లో కూడా రాశాం....అది ఏమంటే మాకంటే తక్కువ ధరకు వేరే రాష్ట్రాల వారికి ఇస్తే ఆ డిఫరెన్స్ ఎమౌంట్ మీ దగ్గర నుంచి వసూలు చేస్తామని సరఫరా చేసిన సంస్ధకు స్పష్టంగా చెప్పాం.ప్రజాధనాన్ని కాపాడాలనే అంత చిత్తశుధ్దితో మా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు పనిచేస్తున్నారు. చంద్రబాబు హయం లో రెండు పుష్కరాలలో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో లెక్కేలేదు....ఇప్పుడు అక్కడ ఘాట్లు ఉన్నాయా...ఆ ఘాట్లకు మెట్లు ఉన్నాయా," అంటూ హఫీజ్ ఖాన్ ప్రశ్నించారు. " పుష్కరాలు చేశారు...అక్కడ మీరు వీడియో షూటింగ్ చేశారు.ఆ వీడియో షూటింగ్ వల్ల ఎంతో మంది చనిపోయారు.దాని గురించి మీకు మనస్సాక్షి లేదా.దానిని కూడా మేం యాక్సిడెంట్ గానే చూశాం.మానవత్వ కోణంలో చూశాం.ఎక్కడైతే తప్పు జరిగిందో దానిని సరిదిద్దండి అని చెప్పాం.
కాని మీరు ఈరోజు ఏం చేస్తున్నారు...కరోనా వైరస్ ముస్లిం సమాజం తీసుకుని వచ్చింది...ముస్లిం సమాజం మొత్తం ఒక సూసైడ్ బాంబర్స్ లెక్క.వైరస్ అంటించుకుని, పూసుకుని వారికి ప్రాణాలపైన ఏమీ ప్రేమలేదు....వారి కుటుంబసభ్యులపైన ఏమీ ప్రేమలేదు....వారు చావడానికి,కొంతమందిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు చిత్రీకరించడం చాలా బాధాకరం. ఈరోజు మీ లోకేష్ బాబు, కొడుకుతో సైకిల్ తొక్కుకుంటూ, ఏసి ఇళ్లలో ఉంటూ ట్వీట్లతో పనిచేస్తున్నారు.మీ ఎంఎల్ ఏలు ఇళ్లకు పరిమితమయ్యారు.ప్రజలకు సేవచేయడం గాని,ప్రజలపైన దృష్టిగాని పెట్టలేదు. కాని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం,అధికారులు,ఎంఎల్ ఏలు రోడ్లపైకి వచ్చి ప్రజలను ఆ దుకుంటూ వారికి ధైర్యం ఇస్తూ మేం పనిచేస్తున్నాం.భూమాఅఖిలప్రియగారు...మీ ఆళ్లగడ్డనుంచి కొందరు మా రాయలసీమ యూనివర్శిటికి వచ్చి భయాంధోళనలో ఉండి వారు బాధపడుతుంటే...నా ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వారికి కరోనా లక్షణాలు ఉండచ్చు అని తెలిసి కూడా వారికి ధైర్యం ఇచ్చాను. భరోసా ఇచ్చాను.ప్రపంచం అంతా కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతుంటే చంద్రబాబు వారికి కావాల్సిన ఎల్లోమీడియా...వారి సోషల్ మీడియా,టిడిపి రాజకీయనిరుద్యోగులు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారుని హఫీజ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.