English | Telugu
తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గిరాజుకుంది! కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ!
Updated : May 13, 2020
నీటి పంపకాల విషయంలో కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీరు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన రాయలసీమ దుర్భిక్ష నివారణ ఎత్తిపోతల పథకం ప్రధానంగా చర్చకు రానుంది. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత నెలకొల్పడానికి.. వివాదాలను కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్ఎంబీ) ద్వారా పరిష్కరించేందుకు కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీరు అధ్యక్షతన కేంద్ర జలవనరుల శాఖ ఓ కమిటీ ఏర్పాటుచేసింది.
హైదరాబాద్లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు స్కైప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనుంది.
కృష్ణా బేసిన్లో మిగులు జలాల్ని తెలుగు రాష్ట్రాలు ఎలా వాడుకోవాలో డిసైడ్ చేస్తారు. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ నుంచి కమిటీ సభ్యులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ కమిటీకి చైర్మన్గా కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ ఉన్నారు. సభ్యులుగా ఏపీ, తెలంగాణ అధికారులు ఉన్నారు.
ఇప్పటివరకు ఉన్న రూల్ ప్రకారం... కృష్ణా బేసిన్లోని నికర జలాల్లో ఏపీ, తెలంగాణకు 811 టీఎంసీలను కేటాయించగా... వాటిలో తెలంగాణ 299 టీఎంసీలు, ఏపీ 512 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంది. అంతా క్లారిటీగా ఉంటే... మరి వివాదం ఎందుకు వచ్చిందన్నది కీలక అంశం.
కర్ణాటక, మహారాష్ట్రలో కొన్ని సంవత్సరాల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు పెద్ద ఎత్తున వరదలు వస్తాయి. అప్పుడు కృష్ణా బేసిన్లో 811 టీఎంసీల కంటే ఎక్కువ నీరు వస్తుంది. ఆ ఎక్కువ నీరును ఎలా పంచుకోవాలి అన్నది ఇప్పటివరకూ డిసైడ్ చెయ్యలేదు. ఎందుకంటే... అలా ఎక్కువ నీరు వస్తున్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఆ మిగులు జలాలపై రచ్చ నడుస్తోంది కాబట్టి... దానిపై కూడా లెక్క తేల్చేయడం బెటరని కృష్ణా బోర్డు అనుకుంది. కేంద్రంతో మాట్లాడితే... కేంద్రం ఓ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చక్కగా సమస్యను చర్చించి... రెండు రాష్ట్రాలకూ ఇబ్బంది లేకుండా పరిష్కారం చూపించేస్తే... ఇక ఏ వివాదమూ ఉండదు. ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాలూ... అన్నదమ్ముల్లా హాయిగా ఉన్నాయి.