గత అర్ధరాత్రి నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. మంగళవారం అర్ధ రాత్రి సరిగ్గా 11:53 గంటలకు పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టు నేపాల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. డొలాకా జిల్లాలోని జుగు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. దీని ప్రభావంతో ఖాట్మాండు, కాస్కీ, పర్సా, సింధుపల్‌చోక్ తదితరా ప్రాంతాల్లో భూకంపనాలు సంభవించాయని 'హిమాలయన్ టైమ్స్' పేర్కొంది. అయితే భూకంపం ధాటికి ఎవరు గాయపడినట్టు, చనిపోయినట్టు, ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం లేదు. నేపాల్ సరిహద్దులోని భారత్ ప్రాంతంలోనూ భూకంపనాలు సంభవించలేదని సమాచారం.