English | Telugu
నిమ్మగడ్డ రమేష్ తొలగింపులో జగన్ సర్కార్ తప్పటడుగులు వేసిందా?
Updated : Apr 15, 2020
ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు కోసం జారీ చేసిన ఆర్డినెన్స్ లో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. అయితే ఇందులో ఒక అంశానికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా రెండో అంశం మాత్రం కచ్చితంగా నిమ్మగడ్డను టార్గెట్ చేసి పెట్టిందే అనే భావన న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. కమిషనర్ పదవీకాలం సవరణ చేసే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాగో ఉంది. ఈ విషయంలో నిమ్మగడ్డకు ఎలాంటి రాజ్యాంగ రక్షణ లభించబోదు. అయితే ఆయన సర్వీసు రూల్స్ లో మార్పులు చేసే విషయంలో మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ లో ప్రస్తావించిన సర్వీస్ రూల్స్ మార్పు వ్యవహారం కొత్త కమిషనర్ ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిందే. అయితే ఈ నిబంధన విషయంలో రాజ్యాంగంలో ఉన్న అర్ధం ప్రకారం ప్రస్తుత కమిషనర్ సర్వీస్ రూల్స్ ను మార్చడం ద్వారా ఆయనకు నష్టం కలిగేలా చేయరాదన్నది రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే చెబుతోంది. అయితే ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వం ఆర్టికల్ 243లోని పదవీకాలం నిబంధన మాత్రమే వాడుకుని నిమ్మగడ్డను తొలగించింది. దీంతో ఇప్పుడు ఇదే విషయాన్ని వచ్చే సోమవారం జరిగే వాదనల సందర్బంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయవాది ప్రస్తావించే అవకాశముంది. అప్పుడు న్యాయస్ధానం ఎలా స్పందిస్తుందో చూడాలి.