English | Telugu
ఈ నెల 20 తర్వాత ఏపీలో కీలక నిర్ణయాలు ఉంటాయా?
Updated : Apr 15, 2020
రాజధాని తరలింపు కోసం గతేడాది డిసెంబర్ లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటు కోసం సీఎం జగన్ చేసిన ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కోర్టులో న్యాయపరమైన చిక్కులతో పాటు రాజధాని బిల్లులను మండలిలో నెగ్గించుకోలేకపోవడం వంటి చర్యలతో ప్రభుత్వం పట్ల సామాన్యుల్లోనూ ఓ రకమైన భావన ఏర్పడింది. అయినా పట్టువీడని ప్రభుత్వం తాజాగా ఉద్యోగులను మే నెలలో ఎట్టి పరిస్ధితుల్లోనూ విశాఖ తరలించేందుకు సిద్ధం చేస్తోంది. ఆ లోపే కరోనా వైరస్ ప్రభావం పెరిగి లాక్ డౌన్ విధించినా బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం ప్రభుత్వం తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
అమరావతి నుంచి విశాఖకు వెళ్లేందుకు సీఎం జగన్ మే నెల 2వ తేదీన ఓ ముహుర్తంగా పెట్టుకున్నారనే ప్రచారం మొన్నటివరకూ సాగింది. అయితే తాజాగా ప్రధాని కరోనా వైరస్ లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకూ పెంచిన నేపథ్యంలో రెండు లేదా మూడో వారంలో తరలింపుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగుల తరలింపు కుదరకపోయినా ప్రస్తుతానికి సీఎంవో కార్యకలాపాలు మాత్రం విశాఖ నుంచే నడిపించాలనే ఉద్దేశంలో సీఎం జగన్ ఉన్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. వీటితో పాటు స్ధానిక ఎన్నికలకు సంబంధించిన కీలక నిర్ణయాలను కూడా ఈ నెల చివరి వారంలో ప్రభుత్వం తీసుకోబోతున్నట్లు వెలగపూడి సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.