గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మారుస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రకటించారు. జిల్లాలో 126 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. 18 ట్రూ నాట్ మిషన్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని, 1,500 పరీక్షలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. 15 కేసులుంటేనే రెడ్ జోన్ గా ప్రకటిస్తామని, 4 కేసులుంటే క్లస్టర్ జోన్ గా ప్రకటిస్తామని, మూడు నెలలపాటు రెడ్ జోన్లలో ఎవరైనా ఇంటి అద్దె అడగరాదనీ, ఎవరైనా యజమానులు అద్దె అడిగితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కంటైన్మెంట్ జోన్లలో ముందుగా రూ.1,000 ఆర్థికసాయం అందచేస్తామని, ఇవాళ 220 మందిని క్వారంటైన్ కేంద్రాల నుంచి డిశ్ఛార్జి చేశామని కలెక్టర్ చెప్పారు. కర్ణాటక హుబ్లీలో యజమాని ముందుకు వచ్చి హోటల్ స్వచ్ఛందంగా అప్పగించారని, మిగతా అందరికీ ఇది స్ఫూర్తిదాయకం కావాలని కలెక్టర్ సూచించారు.