English | Telugu

భారీగా తగ్గిన బంగారం డిమాండ్!

భార‌త్‌లో ఆభరణాలకు డిమాండ్ ఎక్కువ. అందుకే ప్ర‌తి ఏడాది దాదాపు 800 నుండి 900 టన్నుల బంగారాన్ని భార‌త్ దిగుమతి చేసుకుంటుంది. లాక్ డౌన్ కారణంగా పసిడి వినియోగం తగ్గింది. దాంతో జనవరి-మార్చి క్వార్టర్‌లో బంగారం దిగుమతులు 55% తగ్గాయి. ఈ ఏడాది మన దేశంలో పసిడి వినియోగం గత ఏడాదితో పోలిస్తే 50% తగ్గనుందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ తెలిపారు.

గత ఏడాది 690.4 టన్నుల పసిడి వినిమయం ఉండగా, ఈసారి వినియోగం మూడు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. వినియోగం 1991 నాటి 350 టన్నుల నుండి 400 టన్నుల మధ్య పడిపోవచ్చునని అంచనా వేస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ సమయంలో లాక్ డొన్ కొనసాగుతోంది. ప్రస్తుతం బంగారం కొనలేని పరిస్థితులు. బంగారానికి కీలకమైన ఇలాంటి సీజన్‌లో లాక్ డౌన్ ఉండటంతో కొనుగోళ్లు క్షీణించాయి.

2019-20 ఆర్థిక సంవత్సరంలో జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులు 11 శాతం పడిపోయి 35.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయ‌ని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభ‌న్ తెలిపారు.