English | Telugu
దీక్షా రాజకీయాలతో వేడిపుట్టిస్తున్న నేతలు!
Updated : Apr 17, 2020
వీరి నినాదం ఒక్కటే పేదలకు ఆర్థిక సహాయం చేయాలి. కరోనాను వెంటనే నియంత్రించాలి. ఇదే రాజకీయం. విశాఖ, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ, సీపీఐ నేతలు దీక్షలు నిర్వహించారు. వీరిలో కొందరు పేదలకు కరోనా సాయం కింద 5 వేల నుంచి 10 వేల రూపాయల దాకా ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తే మరికొందరు అఖిల పక్ష సమావేశాలు నిర్వహించి, కరోనా నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలని విఙ్ఞప్తి చేశారు. ఆర్థిక సాయం పేరిట నిరాహార దీక్షలకు దిగుతున్నారు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వర రావు తన ఇంట్లోనే 12 గంటలపాటు నిరాహార దీక్ష చేశారు. రేషన్ కార్డు ఉన్నా, లేకపోయినా పేదలందరికీ 5000 రూపాయలు ఇవ్వాలని, అన్నా క్యాంటీన్లు తెరిచి పేదలకు టిఫిన్, భోజనం అందించాలని, కరోనా వైరస్‌పై పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు, ఇతర అధికారులందరికీ నాణ్యమైన రక్షణ కిట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. క్వారెంటైన్ పీరియడ్ పూర్తి చేసిన ప్రతి ఒక్క పేదకు 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విజయవాడ సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జంగాల అజయ్, మాల్యాద్రి నిరాహారదీక్షకు కూర్చున్నారు. లాక్ డౌన్ నేపద్యంలో ఒక్కో పేదవాడికి 10 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలను ప్రారంభించిన ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ వీరి దీక్షలను ప్రారంభించారు.
లాక్ డౌన్ కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, జాతీయ స్థాయిలో మోదీ అందరితో మాట్లాడుతూ కరోనా నియంత్రణ చర్యలను తీసుకుంటుంటే.. ఏపీలో జగన్ ప్రభుత్వం ఒంటెద్దుపోకడలకు పోతోందని రామకృష్ణ విమర్శించారు.