English | Telugu
విశాఖలో ఇంటర్మీడియట్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
Updated : Oct 31, 2019
ప్రశాంతమైన విశాఖ నగరంలో వరుస అత్యాచార ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా గ్యాంగ్ రేప్ వ్యవహారం ఒక్కసారిగా అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఇంటర్మీడియట్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. కూల్ డ్రింక్ లో మద్యం కలిపి అఘాయిత్యానికి ఒడిగట్టారు దుర్మార్గులు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల్లో ఇద్దరు మైనర్లున్నారు.
కాలేజ్ కు వెళుతున్నామని ఇంటి నుండి బయలుదేరిన ఆ యువతిని ఒక పరిచయస్తుడు మాయ మాటలు చెప్పి పర్యాటక ప్రాంతమైన కైలాసగిరి కొండపైకి తీసుకెళ్లాడు. కైలాసగిరికి తీసుకువెళ్లి అక్కడ కూల్ డ్రింక్ లో ఆ యువతికి తెలియకుండా మద్యాన్ని కలిపాడు. మాటల్లో పెట్టి ఆమెకు ఆ డ్రింక్ మొత్తం తాగించాడు. మత్తులోకి జారుకున్న తరువాత ఆ యువతిపై నలుగురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో బీట్ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి పరిశీలిస్తే అక్కడ ఘోరాన్ని చూసి షాక్ కు గురయ్యారు. ఆ నలుగురిని అదుపులోకి తీసుకొని బాధితురాలిని చికిత్స కోసం కేజీహెచ్ కు తరలించారు. కేజీహెచ్ లో వైద్య సేవలు పొందుతున్న బాధితురాలుని పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కూడా సూచించారు.
ఈ ఘటన పై మహిళా సంఘాలు స్పందిస్తూ అమ్మాయి ట్యూషన్ అని ఇంట్లో చెప్పి వెళ్ళిందని, వాళ్లు చాలా పేద కుటుంబం అని ఒక్కత్తే కూతురు అని వెల్లడించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అమ్మాయి నర్సింగ్ కోసం కోచింగ్ వెళుతుంది. తను కోచింగ్ కి వెళ్లిందనే ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు అని వెల్లడించారు. పేరెంట్స్, స్కూల్సు, పౌర సమాజం, పోలీసులు నలుగురు కలిసి ఏకతాటిగా వచ్చి వీటి పై అవగాహన కల్పించి పిల్లల్ని కంట్రోల్లో పెట్టినప్పుడే ఇలాంటి అఘాయిత్యాలు తగ్గు ముఖం పట్టే అవకాశముందని మహిళా సంఘాలు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.