English | Telugu
ఓ ఎంపీకి ఉన్న విలువ కూడా సీఎంకు లేదా? జగన్ ఢిల్లీ టూర్ పై ఆగని విమర్శలు
Updated : Oct 23, 2019
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా ఢిల్లీలో తేడా కొట్టకపోతే ఈ విమర్శలు రావన్నది అంతే నిజం. 24గంటల సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత కేంద్ర హోంమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వడం... పైగా ఏమీ మాట్లాడకుండానే కేవలం వినతిపత్రం తీసుకుని పంపేశారన్న ప్రచారం జరుగుతోంది. ఇక, ఇద్దరు కేంద్ర మంత్రులు ఏకంగా జగన్ కి ఇచ్చిన అపాయింట్ మెంట్లను రద్దు చేసుకున్నారన్న సంగతి... ఢిల్లీలోనూ... ఏపీలో కలకలం రేపుతోంది. అయితే, ఈ ఆరోపణలను వైసీపీ కేంద్ర కార్యాలయం ఖండించినప్పటికినీ, విమర్శలు మాత్రం ఆగడం లేదు.
ఇఫ్పటికే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ... జగన్ ఢిల్లీ టూర్ పై సెటైర్లు వేయగా, సీపీఐ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓ సాధారణ ఎంపీకి ఉన్న విలువ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేదా అంటూ ప్రశ్నించారు. కేంద్ర పెద్దలు అసలెందుకు జగన్ కు విలువ ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు జగన్ ఢిల్లీ పర్యటనలో ఏఏ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారో... ఎన్ని డిమాండ్లకు అంగీకారం తెలిపిందో చెప్పాలన్నారు. అంతేకాదు జగన్ ఢిల్లీ టూర్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించి... వివరాలు చెప్పాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు.